నేడు టాలీవుడ్‌లో కూడా ట్రెండ్ మారుతోంది. సాధారణంగా హీరోలను చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు నేడు సాంకేతిక వర్గాలని కూడా గమనిస్తున్నారు. దర్శకుడు ఎవరు? నిర్మాత అభిరుచి ఏమిటి? సంగీత దర్శకుడు ఎంత వరకు తన పరిధిలో రంజింపజేయగలడు? అనే అంశాలను కూడా సునిశితంగా పరిశీలించిన తర్వాతే థియేటర్‌కి వెళ్తున్నాడు. ఇది నిజంగా మంచి మార్పుకి నాందిగానే చెప్పుకోవాలి. ఇక విషయానికి వస్తే 'దేవదాస్'తో స్రవంతి రవికిషోర్ ఫ్యామిలీ కుర్రాడైన రామ్ హీరోగా మొదటి చిత్రంతోనే మెప్పించాడు. సుకుమార్ వంటి విభిన్న దర్శకునితో ఆయన చేసిన రెండో చిత్రం 'జగడం' ఒక వర్గం వారిని మాత్రమే ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి. తర్వాత 'రెడీ, మస్కా'లతో ఓకే అనిపించుకున్నాడు. వెంటనే 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం ద్వారా దిల్‌రాజు నిర్మాతగా తీసిన చిత్రం కూడా ఆకట్టుకోలేదు. 'కందిరీగ' విజయం తర్వాత ఆయనకు చెప్పుకోదగిన హిట్ మరలా రాలేదు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన 'ఎందుకంటే ప్రేమంట', బొమ్మరిల్లు భాస్కర్ మొదటి సారిగా ఫీల్‌గుడ్ కథను వదిలేసి పక్కా మాస్ చిత్రంగా తీసిన 'ఒంగోలు గిత్త' కూడా దెబ్బతీశాయి. వెంకీతో చేసిన మల్టీస్టారర్ 'మసాలా', గోపీచంద్ మలినేని 'పండగ చేస్కో', 'శివం' వంటి చిత్రాలు దారుణమైన ఫలితాలను అందించాయి. ఆ తర్వాత వచ్చిన 'నేను..శైలజ' మరలా రామ్‌కి మంచి హిట్‌ని ఇచ్చింది.
కానీ ఆ విజయ పరంపరను కొనసాగించడంలో రామ్ విఫలయ్యాడు. 'హైపర్' చిత్రం డిజాస్టర్ కాగా 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విఫలమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన దిల్‌రాజు బేనర్‌లో 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం చేస్తున్నాడు. దీనికి వరుసగా తన మొదటి రెండు చిత్రాలను హిట్స్‌గా నిలిపిన ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ముగ్గురి మీదనే రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విజయదశమి కానుకగా మంచి పోటీలో విడుదల చేయనున్నారు. ఇక చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను తాజాగా విడుదల చేశారు. 'దూరం దూరం దూరం దూరం గుండే ఆకాశం.. దగ్గరకొచ్చి గారం చేసిందా...భారం భారం భారం భారం అనుకోకుండా నాతో పాటు భూమిని లాగిందా' అని సాగే ఈ గీతానికి 'అత్తారింటికి దారేది' చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ రచయిత శ్రీమణి అద్భుతమైన సాహత్యం అందించగా, దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్, అల్ఫాన్స్ జోసెఫ్ ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఓ కుర్రాడి మనసులో ప్రేమ పుట్టినప్పుడు చోటుచేసుకునే సంతోషం నుంచి పుట్టిన పాటగా ఇది ఉంది. ఈ సాంగ్‌లో రామ్ గతంలో కంటే హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటే, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఇప్పటి వరకు కనిపించని విధంగా ఎంతో గ్లామరస్‌గా ఉంది. మరి రామ్ ఆశిస్తున్న బ్రేక్ ఈ చిత్రంతోనైనా లభిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల పోటీని తట్టుకోవాలంటే ఈ విజయం రామ్‌కి ఎంతో కీలకమనే చెప్పాలి.