ఇలియానా డీక్రూజ్ .. ఈమె పేరు వింటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. అధికారికంగా తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న ఈ నాభిసుందరితో చేయాలని నాటి హీరోలు క్యూలో ఉండేవారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఈమె హీరోతో పాటే సమానమైన స్థాయి కలిగిన నటిగా, గోవా కోవాగా పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈమెకి నచ్చిన హీరోలు ఎవరంటూ ప్రశ్నిస్తే తెలివిగా తాను నటించిన అందరి పేర్లు చెప్పడమే కాదు.. ప్రత్యేకంగా తనకు రవితేజ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆయనతో నటిస్తూ ఉంటే అసలు అలసటే తెలియదని, ఆయనలా జాలీగా ఉండే హీరో మరొకరు లేరని కితాబునిచ్చింది. అదే ఇంటర్వ్యూలో తనకి తన మొదటి హీరో రామ్ అంటే ప్రత్యేక అభిమానమని చెప్పింది. తెలుగులో మంచి ఫామ్‌లో ఉండగానే ముంబై ప్లైట్ ఎక్కి బిటౌన్‌లో వాలింది. నాచురల్‌గానే జీరో సైజ్‌లో ఉండే ఆమె తనని చూస్తే బాలీవుడ్ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతారని భావించింది.
బాలీవుడ్‌లో ‘బర్ఫీ, ఫటా పోస్టర్ నిక్లా హీరో, మే తేరా హీరో, హ్యాపీ ఎండింగ్, రుస్తుం, ముబాకరన్, బాద్షాహో, రెయిడ్’ వంటి సినిమాలలో యాక్ట్ చేసింది. తమిళంలో ‘కేడీ’ చిత్రంతో పాటు ‘3ఇడీయట్స్’కి రీమేక్‌గా రూపొందిన శంకర్ చిత్రం ‘నన్బన్’ (తెలుగులో స్నేహితులు)వంటి చిత్రాలలో నటించినా కూడా ఈమెకి తెలుగులో వచ్చిన క్రేజ్ ఎక్కడా రాలేదు. దాంతో ఇంతకాలం తర్వాత మరలా ఆమె రవితేజతోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా ఈమె తనకిష్టమైన రవితేజతో పాటు తన మొదటి హీరో అయిన రామ్‌ని కూడా బాగా సంతోషపరిచింది. తనని సర్‌ప్రైజ్ చేసిందని స్వయంగా హీరో రామ్ చెప్పుకొచ్చాడు. తన స్నేహితురాలు ఎంతో కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని, అంటున్నాడు.
‘నన్ను ఎవరు సర్‌ప్రైజ్ చేశారో చూడండి... చాలా రోజుల తర్వాత నా బాల్య స్నేహితురాలిని కలిసిన ఫీలింగ్ వచ్చింది. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది ఇలియానా’ అని సోషల్‌మీడియా ద్వారా తెలపడమే కాదు.. వాళ్లిద్దరూ తీసుకున్న సెల్ఫీని సైతం రామ్ పోస్ట్ చేశాడు. కాగా ప్రస్తుతం వరుస పరాజయాలలో ఉన్న రామ్ దిల్‌రాజు బేనర్‌లో ‘సినిమా చూపిస్త మావ, నేనులోకల్’ చిత్రాల ద్వారా హిట్స్ కొట్టిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో అనుపమపరమేశ్వరన్, ప్రణీత జంటగా రూపొందుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’లో నటిస్తున్నాడు. రామ్‌తో పాటు ఇలియానా కూడా రవితేజ చిత్రం ద్వారా విజయదశమికే రానుంది. మరి ఈ చిత్రం తర్వాత రామ్‌కి ఏమైనా సాయం చేసి ఆయనతో కూడా నటించడానికి ఇల్లు బేబీ ఒప్పుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!