వారసులైనా ఎవరైనా సరే .. ఏ రంగంలోనైనా కొంతకాలం మాత్రమే వారికి వారసత్వం అనేది మెట్లుగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వారు సొంత టాలెంట్‌తోనే పైకి రావాలి? అనేది నిజమే కావచ్చు. ఉదాహరణకు అంబానీ కొడుకులు విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ రాణించినంత సమర్థవంతంగా అనిల్ అంబానీ రాణించలేకపోయాడు. ఇక కృష్ణ కుమారుల్లో రమేష్‌బాబు కంటే మహేష్‌బాబు బాగా ఆకట్టుకున్నాడు. చిరంజీవి సోదరుల్లో పవన్‌తో పోల్చుకుంటే నాగబాబు విఫలం అయ్యాడు. ఇవ్వన్నీ వాస్తవాలే గానీ మొదట్లో వరుస ఫ్లాప్‌లు వచ్చినా కూడా వారసత్వం వల్ల కొతకాలం పాటు అంటే వారిని వారు నిరూపించుకునే వరకు అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అక్కినేని అఖిల్‌కి వచ్చిన 'అఖిల్, హలో' చిత్రాల తర్వాత కూడా ఆయనకు చాన్స్‌లు వస్తూనే ఉన్నాయంటే కేవలం వారసుడు కావడమే కారణం. అయితే మలయాళంలో మెగాస్టార్ అయిన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ మాత్రం తన తండ్రి ఇమేజ్ తనపై పడకుండా దూసుకెళ్తున్నాడు. ఎందుకంటే మమ్ముట్టి తనయునిగా చెప్పుకుని ఉంటే ఆయనకు క్రేజ్ వచ్చేదే గానీ 'మహానటి'లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల వంటివి వచ్చేవి కావు. కాబట్టి మమ్ముట్టి నీడ పడకపోవడం వల్లే దుల్కర్‌కి అన్నితరహా పాత్రలు వస్తూన్నాయి. వాటి ద్వారా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు.
దుల్కర్ మొదటి చిత్రం నుంచి మమ్ముట్టి సలహాలు గానీ, ప్రమేయం గానీ లేకుండా దుల్కర్ సినిమా సినిమాకి నటునిగా ఎదుగుతున్నాడు. అదే పని చేయకపోవడం వల్ల మోహన్‌లాల్ తనయుడు దెబ్బతింటూ ఉన్నాడు. 'ఓకే బంగారం'తో నూనూగు మీసాల ప్రేమికుడిగా మనసు దోచుకున్న ఈయన తన నటనతో అందరు చీదరించుకునేలా 'మహానటి'లో జెమిని గణేషన్ పాత్రను రక్తికట్టించాడంటే ఆయన నటనా సామర్ధ్యం ఏమిటో అర్ధమవుతుంది. తన తండ్రి నీడన ఉండకపోవడమే ఆయనకు ప్లస్ అవుతోంది. తాజాగా దుల్కర్ మాట్లాడుతూ, నా మహిళా అభిమానులు మాత్రం 'మహానటి' లోని నా నెగటివ్ పాత్రని కేవలం సినిమాగా, నటనగా భావించి లైట్‌గా తీసుకోలేదు. చాలా మంది లేడీ ఫ్యాన్స్ నన్ను ఆ చిత్రం చూసి హర్ట్ అయ్యారు. వారంతా 'ఉయ్ హేట్ యూ' అని సోషల్ మీడియాలో పెట్టారు. సినిమాలోని నా పాత్ర నటనకు సవాల్ లాంటిది కాబట్టే నెగటివ్ పాత్ర అయినా నేను ఒప్పుకున్నాను. ఈ చిత్రానికి యంగ్ టీం పనిచేసింది. ఓ మంచి చిత్రంలో భాగస్వామ్యం కావాలని అందుకు ఒప్పుకున్నాను. నా తండ్రి మెగాస్టార్ అయినా కూడా సినిమాలలో, నిజజీవితంలో కూడా నా తండ్రి గుర్తింపును నేను ఉపయోగించుకోదలుచుకోలేదు.
ఇంట్లో అందరం కలిసి నా చిత్రాలను చూస్తాం. నేను ముందు వరుసలో కూర్చుంటా. సినిమా చూస్తే వెనక వరుసలో ఉన్న నాన్న నవ్వినా, బాగుందని చెప్పినా అవే నాకు ప్రశంసలు. అంతేగానీ నాన్న ప్రత్యేకంగా నన్ను పొగడరు. చెన్నైలో పుట్టి పెరిగిన నాకు మలయాళం, తమిళం బాగా వచ్చు. కాబట్టి ఈ భాషల్లో నాకు ఇబ్బంది లేదు. కానీ తెలుగు మాత్రం రాదు. 'మహానటి'లో తెలుగులోకి డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.