నిజానికి మెగా ఫ్యామిలీకి ఇప్పటికే మూడు బేనర్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ బేనర్లే ఉన్నాయి. గీతాఆర్ట్స్, గీతాఆర్ట్స్2, వి4క్రియేషన్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వన్నీ వారివే. అయినా సరే స్టార్ హీరోలందరు తమ ఇంట్లోనే ఉన్నప్పుడు ఆ అవకాశాలు బయటి వారికి ఎందుకు ఇవ్వాలి? అని ఆలోచించారేమో చరణ్ నిర్మాతగా కొత్తగా 'కొణిదెల' హోం బేనర్‌ని కూడా స్టార్ట్ చేశారు. ఇక మొదటి చిత్రంగా చిరంజీవి 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్ 150'ని ఆ బేనర్‌లో నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి, మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఏడాదంతా కష్టపడి ఆ రెండు సినిమాలు చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కన్నా నిర్మాతగానే చరణ్ హ్యాపీ అయ్యాడని అనిపిస్తోంది. అందుకే ముందుగా అనుకున్నట్లు 151వ చిత్రం చాన్స్‌ని కూడా అరవింద్‌కి ఇవ్వకుండా 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో చిరంజీవి 151వ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'సైరా..నరిసింహారెడ్డి'ని, 'బాహుబలి' రేంజ్‌లో తీస్తున్నాడు.
ఇక ఈ బేనర్‌లో రానున్న మూడో చిత్రం విషయంలో కూడా చరణ్ ఎంతో క్యాలికులేడ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. తనకి మంచి స్నేహితుడైన యంగ్ టైగర్ నందమూరి ఎన్టీఆర్ హీరోగా చరణ్ మూడో చిత్రం చేయనున్నాడట. ఇక వీరిద్దరు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో దానయ్యకి మల్టీస్టారర్ చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే ఎన్టీఆర్ చిత్రం చరణ్‌తో చేసే చిత్రమేనని, అయితే ఇందులో చరణ్ కేవలం నిర్మాత పాత్రను మాత్రమే పోషిస్తున్నాడని సమాచారం.
ఇంకా కొత్త బేనర్ పెడుతున్నాడంటే కొత్త దర్శకులకు, హీరోలకు చాన్స్‌లిస్తాడని, తాము కాకుండా బయటి చిత్రాల ద్వారా కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తాడని భావిస్తే చరణ్ మాత్రం మహా ముదురుగా భలే ప్రాజెక్ట్‌ని సెట్ చేశాడనే భావించాలి. ఇక ఎన్టీఆర్ కూడా ఇటీవల 'జైలవకుశ'ని తన సోదరుడికి చేశాడు. ఇప్పుడు తన స్నేహితునికి చేయనున్నాడు. ఇక పవన్ గతంలో తన బేనర్‌లో రామ్‌చరణ్ చిత్రం ఉంటుందని మాట ఇచ్చాడు. మరి ఆ చిత్రం సంగతేంటి చూడాలి మరి..!