ఇటీవలే సమంత ప్రధానపాత్రలో నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ ‘యూటర్న్’ని.. ఆ చిత్ర ఒరిజినల్ దర్శకుడైన పవన్‌కుమార్ దర్శకత్వంలో అదే టైటిల్‌తో తెలుగులోకి రీమేక్ చేసింది. ఈ చిత్రం అదే రోజున విడుదలైన నాగచైతన్య, రమ్యకృష్ణ, మారుతిల చిత్రం ‘శైలజారెడ్డిఅల్లుడు’ కంటే మంచి టాక్‌ని, రివ్యూలను సొంతం చేసుకుంది. కానీ మంచి టాక్ వచ్చినా కూడా ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా సమంత ఓ మంచి చిత్రం చేసిందనే ప్రశంసలు వచ్చాయి. కానీ ఈ చిత్రం విడుదలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ‘‘మంచి పేరు ఎవరికి కావాలి? సినిమా బాగుందా? లేదా ? అనేది బాక్సాఫీస్ విజయం మీదనే ఆధారపడుతుంది’’ అని నొక్కి చెప్పింది. అలా సమంత కోణంలో చూస్తే మంచి చిత్రం కాదనే చెప్పాలి.
ఇక విషయానికి వస్తే తెలుగు దర్శకులైనా కూడా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికెలు ఇటీవల తీసిన హర్రర్ చిత్రం ‘స్త్రీ’ చిత్రం బాలీవుడ్‌లో భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో నటించిన శ్రద్దాకపూర్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ఆగష్టు31న విడుదలై 15కోట్లతో రూపొంది ఏకంగా 100కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ దర్శకద్వయం గతంలో తెలుగులో ‘డి ఫర్ దోపిడీ’ అనే చిత్రాన్ని తీశారు. నాడు మహేష్‌బాబు కూడా వారికి చాన్స్ ఇస్తానని చివరలో హ్యాండిచ్చాడు.
ప్రస్తుతం ఈ బాలీవుడ్ ‘స్త్రీ’ చిత్రాన్ని రాజ్-కృష్ణలు తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. శ్రద్దాకపూర్ పోషించిన ప్రదాన పాత్ర కోసం సమంతను అనుకుంటున్నారు. మరి ‘యూటర్న్’ ఇచ్చిన షాక్‌తో ఇందులో సమంత నటించడానికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి. మరో వైపు సమంత నో అంటే నిహారిక లేదా అనుష్కల పేర్లను కూడా ఈ దర్శకద్వయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎవరు నటించడానికి ఓకే చెబుతారో వేచిచూడాల్సివుంది..!