ఒక బయోపిక్‌ని తీయాలంటే వారి జీవితం సాఫీగా, ఎలాంటి వివాదాలు, మలుపు లేకుండా ఉంటే తీయడం కష్టం. అలాగని సినిమా కోసమని చెప్పి సినిమాటిక్ అంశాలను జోడిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవల జీవితంలో ఎన్నో మలుపులు తిరిగిన నటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' అద్భుత విజయం సాధించిందంటే కేవలం ఆమె జీవితంలోని ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, అనూహ్యమైన మలుపులు వంటివి బాగా పండాయి. మేటి నటిగా ఉంటూ జెమిని ప్రేమలో పడటం, అందరినీ దూరం చేసుకుని ఆస్తులన్నీ పోయి, మరణించే ముందు దీనావస్థలో, మద్యానికి వ్యసన పరులాలుగా మారడం వంటివి ఉన్నాయి. ఇక ప్రస్తుతం రూపొందుతున్న 'ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి' జీవితాలలో కూడా ఇలాంటి ములుపులు, విమర్శలు, విభిన్న అభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు కత్తి కాంతారావు జీవితం కూడా అంతే.
ఇక విషయానికి వస్తే వెండితెరపై ఓ వెలుగు వెలిగి, స్టార్ హీరోయిన్‌గా మారిన జయలలిత తర్వాత ఎంజీఆర్ పంచన చేరడం, ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్‌ని కూడా కాదని ప్రజలకు జయ చేరువైన తీరు, ముఖ్యమంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఆమెని తమిళ ప్రజలకు అమ్మని చేశాయి. ఇందిరాగాంధీ తర్వాత ఐరన్‌లేడీ అనే పదం ఖచ్చితంగా అమ్మకే సరిపోతుంది. ఇక అమ్మ మరణానంతరం ఆమెపై సినిమాలు తీసేందుకు తెలుగులో దాసరి నారాయణరావు, వర్మ వంటి ప్రయత్నాలు చేశారు. దాసరి మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక వర్మ ప్రకటించాడే గానీ మరలా ఆ ఊసే ఎత్తలేదు. కానీ అందరికంటే ముందు తమిళ దర్శకుడైన ప్రియదర్శని అమ్మ బయోపిక్‌కి శ్రీకారం చుట్టాడు. ఈయన తీయబోయే బయోపిక్‌కి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ని సంచలన దర్శకుడు మురుగదాస్ విడుదల చేశాడు.
ఈ సందర్భంగా జయలలిత బయోపిక్ 'ది ఐరన్‌లేడీ' పోస్టర్‌ని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని మురుగదాస్ తెలిపారు. సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఇందులో అమ్మపాత్రను శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్ పోషించనుండడం మాత్రం కొందరికి నచ్చడం లేదు. అంత బరువైన పాత్రను ఆమె ఎలా చేస్తుందో వేచిచూడాల్సివుంది..! ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రూపొందించి అమ్మకు అంకితం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 24న అమ్మ జయంతి సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.