తెలుగులో యంగ్ డైరెక్టర్‌గా, రైటర్‌గా బాబి అలియాస్ కె.యస్.రవీంద్రకి మంచి గుర్తింపే ఉంది. ఈయన 'మిర్చి, ఓం త్రీడీ, మిస్టర్ నూకయ్య, అదుర్స్' చిత్రాలలో పార్టిసిపేట్ చేసి థ్యాంక్స్ కార్డుని పొందాడు. 'బలుపు, భద్రాద్రి, అల్లుడు శీను' వంటి సినిమాలకు స్టోరీ రైటర్‌గా పనిచేశాడు. దర్శకత్వ శాఖలో దశరథ్, గోపీచంద్ మలినేని వద్ద పనిచేశాడు. 'బాడీగార్డ్, ఓ మైఫ్రెండ్, మిస్టర్‌పర్‌ఫెక్ట్, డాన్‌శ్రీను' చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించాడు. ఈయన కోనవెంకట్‌తో కలిసి పలు చిత్రాలకు పనిచేశాడు. కోన సాయంతోనే దర్శకునిగా మారాడు. మొదటి చిత్రంగా తనకిష్టమైన రవితేజతో 'పవర్' చిత్రం ద్వారా దర్శకునిగా మారాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. రెండో చిత్రంతోనే పవన్‌కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్'కి దర్శకత్వం వహించగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
కానీ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుసగా 'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' వంటి వరుస హిట్స్ తర్వాత తన సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా చేసిన 'జైలవకుశ' చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను ఎంతో నమ్మకంతో బాబికి అందించాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం విడుదలై ఏడాది గడిచిపోయింది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో 'అరవిందసమేత వీరరాఘవ' చేస్తుండగా, బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా 'వెంకీ మామా' మొదలుకానుంది.
ఇక తాజాగా బాబి 'జైలవకుశ' గురించి మాట్లాడుతూ, 'జైలవకుశ' వచ్చి అప్పుడే ఏడాది అయిందా? నాకు ఆశ్చర్యంగా ఉంది. తొలిరోజున ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌ని అసలు మర్చిపోలేను. 'జై' పాత్రను మలిచిన తీరుని ఎందరో అభినందించారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో ఆయన్ను తప్ప మరెవ్వరినీ నేను ఊహించుకోలేను. అంతగా ఆ పాత్రలో ఆయన నట విశ్వరూపం చూపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇంతటి విజయానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని తెలిపాడు. కానీ మొదట బాబీ ఈ కథను రవితేజ వద్దకు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇక 'జైలవకుశ' బాక్సాఫీస్ వద్ద 120కోట్లను కొల్లగొట్టిందని నిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే.