శ్రావ్య మూవీస్ బ్యానర్‌లో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సరీష్, గీత హీరోహీరోయిన్లుగా పోసాని కృష్ణమురళీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘బిల్డప్ కృష్ణ’. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ..‘‘బిల్డప్ కృష్ణ. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో చేశా. అప్పట్లో ఐదారు ఫ్యామిలీల మధ్యలో కీ పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర. చాలా కాలం తర్వాత చాలా మంచి పాత్ర వచ్చింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి వంటి పాత్రలు మారుతీరావుగారు చేశారు. దర్శకుడు విన్సెంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చారు. రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను రాసుకోలేకపోయా. ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడిగారే కనబడతారు. నా పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. నవ్వించాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాను. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దపెద్దగా ఏడ్చే పాత్రలో చేశా. ఈ సినిమాలో ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. ఆ సీన్లు చూసిన తర్వాత నాకు నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. ఈ సినిమా చూసేటప్పుడు మీకు కూడా కన్నీళ్లు వస్తాయి. అంత మంచి సీన్స్ నాకు డైరెక్టర్‌గారు ఈ సినిమాలో ఇచ్చారు. నాలో ఎంత దమ్ము ఉంది అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం ఇచ్చాడు. నా పాత్రే కాదు.. సినిమా కథ కూడా ప్రాక్టికల్‌గా, సహజంగా, లవ్‌బుల్‌గా ఉంటుంది. ఒక మగాడు తప్పు చేయడానికి ఈ సొసైటీలో ఎలాంటి వాతావరణం ఉందో.. అలాగే ఓ ఆడది రాంగ్ రూట్‌లో వెళ్లడానికి ఈ సొసైటీలో ఉన్న కారణాలను చాలా సహజంగా ఇందులో చూపించారు. ఒక రైటర్‌గా నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా చెప్పగలుగుతున్నా. నేను ప్రేమించి ఈ సినిమా చేశా. నాకు చాలా మంచి పేరు వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా. అందుకే ప్రెస్‌మీట్ కూడా మా ఇంటిలోనే పెట్టమని చెప్పా.. అందరూ ఈ సినిమా చూడండి. కొత్త పోసానిని చూస్తారు.. ’’ అని అన్నారు.
డైరెక్టర్ విన్సెంట్ సెల్వ మాట్లాడుతూ..‘‘సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది..’’ అన్నారు.
హీరో సరీష్ మాట్లాడుతూ..‘‘ఇది నా మొదటి చిత్రం. మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు విన్సెంట్ మంచి పాత్ర ఇచ్చారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఈ పాత్రతో నన్ను పరిచయం చేస్తున్న విన్సెంట్‌గారికి ధన్యవాదాలు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.