ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. పురాతన మన దేశ ఆనవాళ్లలానే ఉండే జార్జియాలో గతంలో 'కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చిత్రాల షూటింగ్స్ కూడా జరిగాయి. ఇక జార్జియాకి పొరుగు దేశమైన అజర్ బైజాన్‌లో బోయపాటి శ్రీను-రామ్‌చరణ్-దానయ్యల చిత్రం షూటింగ్ జరుగుతోంది. బోయపాటి దర్శకత్వంలో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 'సైరా'లో చిరు షూటింగ్‌కి సంబంధించి ఆయనకు కాస్త విశ్రాంతి దొరికింది.
దాంతో ఆయన చరణ్ షూటింగ్ జరుగుతోన్న అజర్ బైజాన్‌కి వెళ్లాడు. చరణ్ షూటింగ్ జరుగుతోన్న షూటింగ్ స్పాట్‌కి వెళ్లి యూనిట్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. షూటింగ్ విశేషాలను ముచ్చటించి, టీమ్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపాడు. అక్కడ చిరంజీవి, నిర్మాత దానయ్య తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గతంలో దానయ్య రామ్‌చరణ్‌తో శ్రీనువైట్ల దర్శకత్వంలో తీసిన 'బ్రూస్‌లీ' చిత్రంలో చరణ్‌తో పాటు చిరు కూడా అతిధి పాత్రలో నటించాడు. ఇక త్వరలో చిరు దానయ్యకి ఒక చిత్రం, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం కూడా చేయనున్నాడు.