శ్రమదోపిడీ గురించి ఎందరో మేధావులు, కమ్యూనిస్ట్ ఉద్యమనేతలు, నక్సలైట్లు మాట్లాడుతూ ఉంటారు గానీ అసలు శ్రమ దోపిడీ కన్నా మేధోదోపిడీ చాలా అన్యాయం. ఇది మనిషి మేధస్సుకి చెందిన విషయం. దీనిపై ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యంగా వ్యాపార, సినిరంగాలలో ఇది ఎక్కువగా జరుగుతోంది. ఎందరో సైంటిస్ట్‌లు కూడా దీని బారిన పడిన వారే. ఇక కాపీ రైట్స్‌తో పాటు ఇతరుల మేధస్సును వాడుకుని తమ పేర్లను వేసుకునే బాపత్తు కుహనా మేధావులకు సమాజంలో లెక్కేలేదు. సినిమా రంగంలో ఘోస్ట్ రచయితల పరిస్థితే దీనికి ఓ ఉదాహరణ. మగధీర నుంచి శ్రీమంతుడు, నేనే రాజు నేనే మంత్రి వంటి నిన్నమొన్నటి చిత్రాల వరకు ఇలాంటి కేసులు ఎన్నో విన్నాం. కానీ వీటిల్లో చివరికు బాధితులే దోషులుగా మిగులుతుండటం విచారకరం.
ఇక తెలుగు రచయితల్లో నెల్లూరుకు చెందిన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌ది ప్రత్యేకస్థానం. రాజశ్రీ తర్వాత తెలుగు అనువాద చిత్రాలకు ఈయన మూలదిక్కుగా ఉన్నారు. నేరుగా తెలుగు చిత్రాలకే కాదు... తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఎన్నో హిట్ చిత్రాలకు, అవార్డు చిత్రాలకు ఈయన మాటల, పాటల రచయితగా పనిచేశారు.. చేస్తున్నారు. నాటి మణిరత్నం-కమల్‌హాసన్‌ల 'నాయకుడు' నుంచి 'భామనే సత్యభామనే' వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలకు పనిచేశాడు. ఆయన కుమారుడే శశాంక్ వెన్నెలకంటి. ఈయన నేడు తన తండ్రి బాటలో నడుస్తూ తాను కూడా అనువాద, ద్విభాషా చిత్రాల రచయితగా సుస్ధిరస్థానం సాధిస్తున్నాడు. ఇక విషయానికి వస్తే తమిళంలో అగ్ర నిర్మాత అయిన స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా మురుగదాస్ శిష్యుడైన ఆనంద్ శంకర్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ తమిళ, తెలుగు భాషల్లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాజకీయ విమర్శనాత్మక చిత్రం 'నోటా'ని రూపొందించాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
కానీ ఈ చిత్రంపై తెలుగు వెర్షన్ రచయిత శశాంక్ వెన్నెలకంటి చెన్నై నగర పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. 'నోటా' చిత్రం తెలుగు వెర్షన్‌కి తానే మాటలు రాశానని, కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కథ, స్క్రీన్‌ప్లేనే కాకుండా సంభాషణల క్రెడిట్‌ని కూడా దర్శకుడు ఆనంద్ శంకర్ తన పేరే వేసుకుని తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు. ఈ చిత్రం టైటిల్స్‌లో తనకి క్రెడిట్ ఇవ్వడంతో పాటు ఈ చిత్రానికి పనిచేసినందుకు తనకు రావాల్సిన రెమ్యూనరేషన్‌ని కూడా ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. ఒక భారీ నిర్మాత చిత్రానికి అందునా ఇండస్ట్రీలోఎంతో అనుభవం, పరిచయాలు ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికే ఇలా జరిగితే మరి చిన్నవాళ్ల పరిస్థితి ఏమిటో అర్ధమవుతోంది. అయినా ఈ పెద్దమనుషుల చిల్లర బుద్దులు ఏమిటో ఎవ్వరికీ అర్ధం కాని స్థితి.