తెలుగులో ఎంతో మంది అద్భుతమైన రచయితలు ఉన్నా కూడా మన స్టార్స్‌లో చాలా మంది ఇతర భాషా రీమేక్‌లపైనే మోజు పడుతూ ఉంటారు. దానికి కారణాలు అనేకం, ఇతర భాషల్లో ఆల్‌రెడీ ప్రూవ్ చేసుకున్న సబ్జెక్ట్‌లు కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుందని భావించడం, ఇతర భాషలో ఆ చిత్రాన్ని స్వయంగా చూసుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ తమ ఇమేజ్‌కి, క్రేజ్‌కి సరిపోతుందని భావించడం, నిర్మాత, దర్శకులు కూడా సేఫ్ ప్రాజెక్ట్స్‌గా భావించడం వల్ల ఈ భావదారిద్య్రం ఎక్కవ అవుతోంది. కానీ గత కొంతకాలంగా టాలీవుడ్ చిత్రాలవైపే అన్ని వుడ్‌లు దృష్టి సారిస్తూ, ఇక్కడి చిత్రాలను డబ్బింగ్ చేయడం, లేదా రీమేక్ చేయడం కోసం వెంపర్లాడటం చూస్తున్నాం.
ఇక ఇటీవల కాలంలో పలువురు నవతరం దర్శకులు, రచయితలు పలు విభిన్న కథలతో ముందుకు వస్తూ తెలుగు చిత్రాల కంటెంట్ రేంజ్‌ని పెంచుతున్నారు. ఇక తెలుగు స్టార్స్‌లో పెద్దగా రీమేక్‌లపై మోజు లేని స్టార్‌గా బాలకృష్ణని చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే గతంలో రవితేజ కూడా పలు రీమేక్ చిత్రాలలో నటించాడు. 'ఇడియట్, నా ఆటోగ్రాఫ్, దొంగోడు, వీడే, శంభో శివ శంభో' వంటి చిత్రాలలో నటించినా రీమేక్‌లు ఆయనకు విజయాన్ని తెచ్చిన సందర్భాలు బాగా అరుదనే చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళంలో విజయ్ నటించిన 'తేరీ' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. మొదట పవన్‌కళ్యాణ్‌ని అనుకొని, ఆయన రాజకీయాలలో బిజీ కావడం వల్ల అది రవితేజ వద్దకు వచ్చింది.
తాజాగా మాత్రం రవితేజ 'తేరీ' విషయంలో తన మనసు మార్చుకున్నాడట. రీమేక్ కథ వద్దు.. సొంత కథ అయితేనే చేస్తానని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాంతో సంతోష్ శ్రీనివాస్ కూడా రవతేజకి సూట్ అయ్యే కథను వండివార్చే పనుల్లో ఉన్నాడని, ఆ పని పూర్తవ్వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' దసరాకి విడుదలైన వెంటనే ప్రారంభం కానుంది.