తెలంగాణలో రాజకీయ వేడి వాడి వేడిగా ఉండగా, ఏపీలో ఇప్పుడిప్పుడే ఈ వేడి రాజుకుంటోంది. నిజానికి చంద్రబాబు వ్యూహం ప్రకారం ఏపీలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకణ జరిగి సీట్లు పెరిగి ఉంటే అది టిడిపికి ఎంతో ప్లస్ అయ్యేది. ఎందుకంటే టిడిపిలో వలస నాయకులతో పాటు టిడిపి తరపే పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్ధుల ఆశావహ జాబితా ఎక్కువగా ఉంది. కానీ కేంద్రంతో చంద్రబాబుకి చెడటం వాస్తవంగా జగన్‌కి లాభిస్తుందని భావించారు. కానీ ఆయన గ్రాఫ్ గత ఎన్నికలకు, నేటికి ఏమాత్రం పుంజుకోలేదు. మంచి మంచి నాయకులను, పార్టీని నమ్ముకున్న వారిని ఆయన దూరం చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి మేరిగమురళి, మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న మేకపాటి వంటి వారు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక జనసేన మొదటి అభ్యర్థిగా ప్రకటించిన పితాని బాలకృష్ణ విషయంలో కూడా పవన్ వ్యూహాత్మకంగా అడుగు వేశాడు. శెట్టి బలిజ కులానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ప్రకటించాడు. మరోవైపు జగన్ మాత్రం ఒకప్పటిలానే తన నమ్మకస్తులైన మైసూరారెడ్డి వంటి వారిని వదిలి ఎంత సేపు వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు వంటి మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. వైసీపీ వ్యూహాత్మక సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ని కూడా దూరం చేసుకున్నాడు. నిజానికి ఏ పార్టీకైనా టిక్కెట్ కోరిన అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. కానీ అలాంటి సమయంలోనే రాజకీయ పరిణతి అవసరం అవుతుంది. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం, ఫలానా నామినేటెడ్ పదవో మరోకటో చెప్పి నచ్చజెప్పడం, పార్టీలో అందరినీ కలుపుకుపోయే విధానం వంటివి ముఖ్యం. కానీ జగన్ మాత్రం ఇప్పటివరకు ఆ పరిణితిని ప్రదర్శించలేదు. పోయే వారిని గుడ్డిగా పొమ్మంటున్నాడు.
ఇక విషయానికి వస్తే వంగవీటి రంగ, వంగవీటి కుటుంబానికి రాజకీయంగా ఎంతో కీలకమైన కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడలో ఉన్న పట్టు తెలిసిందే. కానీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి విషయంలో వంగవీటి రాధాకి జగన్ వైఖరి మింగుడుపడటం లేదు. ప్రతిదానికి డబ్బునే కొలమానం చేసుకోవడం, ఇటీవల పార్టీలోకి వచ్చిన మల్లాది విష్ణు వంటి వారికి పెద్ద పీట వేయడం రాధాకి నచ్చలేదు. అంతేకాదు.. సమయం సందర్భం లేకుండా అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాధా గతంలో విజయవాడ తూర్పులో గెలిచాడని, ఆ సీటు లేదా కావాలంటే మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తామని మాట్లాడటంతో రాధాతో పాటు ఆయన అనుయాయులు కూడా భగ్గుమంటున్నారు. అంటే అంబటి రాంబాబు వ్యాఖ్యలు విజయవాడ సెంట్రల్ అయితే రాధా ఓడిపోతాడనే విధంగా ఉండటం రాధాకి ప్రతిష్టాత్మక విషయంగా మారింది.
దీంతో జగన్ అండ్ కో హర్ట్ చేయడంతో రాధా అండ్ కో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం టిడిపిలోకి పోలేడు కాబట్టి తన సాటి కులస్థుడు, తనకి, పవన్‌కి పట్టున్న కాపు వర్గం అండతో రాధా జనసేనలో చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇది జగన్‌కి పెద్ద దెబ్బే అని, ఆయన ముందు చూపు లేకుండా వ్యవహరిస్తుండటం వల్లనే టిడిపి నుంచి ఎక్కువగా జనసేనకి వలసలు ఉంటాయని భావించిన వారికి షాక్ ఇస్తూ వైసీపీ నుంచి జనసేనకు వలసలు పెరగడంతో ఈ మార్పు రాబోయే ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.