రష్మికమందన్నా.. కేవలం రెండో చిత్రంతోనే 100కోట్ల క్లబ్‌లో స్థానం పొందిన చిత్రంలో నటించిన హీరోయిన్‌గా టాలీవుడ్‌కి బాగా పరిచయం. ఇక ఈమె మొదటి చిత్రం 2016లో కన్నడలో వచ్చిన ‘కిర్రిక్‌పార్టీ’. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈమెపై కన్నడ పరిశ్రమ చూపే కాదు.. దక్షిణాది చూపు మొత్తం పడింది. ఆ తర్వాత ఆమె ‘అంజనీపుత్ర, ఛమక్’ వంటి కన్నడ చిత్రాలలో నటించింది. తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన ‘ఛలో’ చిత్రం ద్వారా పరిచయం అయింది.
మొదటి చిత్రంతోనే తెలుగులో కూడా వరుస అవకాశాలు సాధించుకుంటోంది. వెంటనే గీతాఆర్ట్స్2 బేనర్‌లో పరుశురాం దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మించగా, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవెరకొండతో ఆమె నటించిన ‘గీతాగోవిందం’ కనీవినీ ఎరుగని విజయం సాధించింది. ఇక ప్రస్తుతం ఆమె అశ్వనీదత్ బేనర్‌లో శ్రీరాం ఆదిత్య దర్శకునిగా నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘దేవదాస్’లో నాని సరసన నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కన్నడలో ‘యజమాన్’ అనే చిత్రంలో నటిస్తూనే తెలుగులో రెండో సారి విజయ్‌దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’, వెంకీ కుడుముల దర్శకత్వంలో రెండోసారి ‘భీష్మ’లో నటిస్తోంది. బెంగుళూర్ టైమ్స్ పత్రిక 2017లో ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017లో మొదటి 30 స్థానాలలో ఈమె కూడా చోటు సాధించింది.
ఇక ఈమె ‘కిర్రిక్‌పార్టీ’ సమయంలోనే నటుడు, నిర్మాత రక్షిత్‌శెట్టితో నిశ్చితార్ధం కూడా చేసుంది. కానీ ఇది రద్దు అయింది. దీనిపై ఆమె మొదటి సారిగా స్పందించింది. ‘‘రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు అయిన విషయం గురించి ఇంతకాలం మౌనంగా ఉండి తప్పు చేశాను. నాపై వస్తున్న కథనాలు, ట్రోల్స్ అన్ని చూస్తున్నాను. బయట నన్ను ఎలా ఊహించుకుంటున్నారో తలుచుకుంటే ఎంతో బాధగా ఉంది. నేను ఎవ్వరినీ నిందించుకోదలుచుకోలేదు. నా మీద జరుగుతున్న ప్రచారం తప్పు అని చెప్పడానికి నా తరపున ఎవ్వరూ ముందుకు రాలేదు. అది బాధాకరమైన విషయం. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ప్రతి కథకు రెండు కారణాలుంటాయి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమని కోరుకుంటున్నాను. నేను భాషాభేదం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తాను..’’ అని చెప్పుకొచ్చింది.