నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రతి విషయానికి కులాన్ని అడ్డుపెట్టుకుని, ఇతను మనవాడు.. ఇతను మనోడు.. అనే పలుకుల పర్యవసానాన్ని సమాజం అనుభవించకతప్పదని ఈ హత్య మరోసారి రుజువు చేసింది. నేటి పెద్దలు, తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచి మంచిని చెప్పకుండా కులాధిపత్యాన్ని, కులాభిమానాన్ని కలిగించేలా ప్రోత్సహిస్తున్నారు. చదువుకున్న మేధావులు, కులమంటే మండిపడే నాయకులే నేడు సమాజంలో పది మందికి వచ్చే సరికి ఏదో తూతూ మంత్రంగా అందరు సమానమే.. వెనుకబడిన కులాలకు ప్రోత్సాహమివ్వాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. అసలు రిజర్వేషన్ మీద ఆధారపడి భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు కూడా ఇంకా కుల జాఢ్యం పోలేదంటే ఈ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందని, మన దేశానికి రిజర్వేషన్ విధానం అనేది ఓ ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అని అర్ధమవుతోంది. కానీ నాయకులు మాత్రం దానిని ఒప్పుకోకుండా రిజర్వేషన్ల పేరుతోనే అన్ని కులాల మధ్య విభజనకు కారణం అవుతున్నారు.
నిజంగా రిజర్వేషన్లు అనేది అందాల్సిన వారికి అందకుండా ఒకటి రెండు కులాలకే పరిమితం అవుతున్నాయి. గిరిజన తండాలలో ఉండే ఎందరో గిరిజనులకు తమకు రిజర్వేషన్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో కూడా తెలుసుకోలేని పరిస్థితిల్లో ఉన్నారు. వారిని అలా చేస్తోంది కూడా దళితనాయకులే అన్నది నిజం. వారికి తెలివితేటలు వస్తే తమ ప్రాబల్యానికి గండి పడుతుందనే ఉద్దేశ్యంతో నిరక్ష్యరాస్యులను అలాగే పెంచి పోషిస్తున్నారు. ఒక దళితుడు ఉన్నత పదవి పొందితే తనలాంటి మరో వంద మందికి సాయం చేయాలనే గుణం ఉండాలనేది రిజర్వేషన్ల అసలు సూత్రం. కానీ దానిని మాత్రం మనవారు గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికీ రిజర్వేషన్లు కావాలని కోరుతున్న మేథావులలో, నాయకులలో, ముఖ్యమంత్రులలో ఎందరు తమ పిల్లలకు ఆదర్శవివాహాలు చేసి స్ఫూర్తిగా నిలబడుతున్నారు? అనేది కూడా ప్రశ్నే. వీటన్నింటికి పరిష్కారాలు కనుగునే వరకు ఇలాంటివి ఆగవు.
ఇక ప్రణయ్ హత్యకు సంబంధించి ఏడుగురు నిందుతులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ స్పందించాడు. ఇలాంటి హత్యలను చూస్తే అసహ్యమేస్తోంది. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? ఈ సమాజం ఎటు వెళ్తోంది? ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని చెప్పాడు. ఈ మాటలు ఎవరైనా చెప్పగలరు. కానీ ముందుకు వచ్చి తామెంతగా ఇతర కులాలను ప్రోత్సహిస్తున్నాం... అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పెద్ద వాళ్లు డబ్బుంటే కులాలను పక్కనపెడుతున్నారు. కానీ వారే దళితుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారనే విషయం దళితులే ఆలోచించాలి. ఇక ఇప్పటికే దీనిపై మంచు మనోజ్, రామ్ వంటి హీరోలు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఇది మరో ఆయేషా కేసులా కాకూడదని కోరుకుందాం...!