తెలుగులోకి గౌతమ్‌మీనన్, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'ఏ మాయచేశావే' పేరుతో పరిచయమై తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తూ లాంగ్ కెరీర్‌ని కొనసాగిస్తున్న టాప్ హీరోయిన్ సమంత. తన మొదటి చిత్రం హీరో అక్కినేని నాగచైతన్యనే వివాహం చేసుకున్న ఆమె అక్కినేని ఇంటి కోడలైంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకి 'అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడటం, 'మనం' చిత్రం సందర్భంలోనే జరిగిందా? లేక అంతకు ముందే ఆయనను కలిశారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమంత సమాధానం ఇస్తూ, ఏ మాయ చేశావే 50రోజుల వేడుకలో ఏయన్నార్ గారిని చూశాను. సాధారణంగా నేను ఎవ్వరి కాంప్లిమెంట్స్‌ని పట్టించుకోను. నెక్ట్స్ ఏం చేయాలి? అనే విషయంపైనే దృష్టి పెడతాను.
కానీ నాగేశ్వరరావు వంటి మహానటుడు ఇచ్చిన కాంప్లిమెంట్‌ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను. జీవితాంతం దాచుకుంటాను. ఈ సినిమాలో నటనపరంగా 50 మార్కులకు గాను తాను నాగచైతన్యకి 49 మార్కులే వేస్తానని, సమంతకి మాత్రం 50కి 51 మార్కులు వేస్తానని ఏయన్నార్ గారు అన్నారు. ఆయనిచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది. బహుశా ఆనాడు తన మనవడైన నాగచైతన్యని వివాహం చేసుకోబోయది ఈమె అని ఏయన్నార్‌కి తెలిసి ఉండకపోవచ్చు.