ఉత్తరాదిలో సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన ఖుష్బూ తన జీవితంలో చిన్నతనంలోనే తన తండ్రి వలన పలు రకాలుగా హింసకి గురైంది. ఇక ఆ తర్వాత 1980 నుంచి 1982వరకు పలు బాలీవుడ్ చిత్రాలలో బాలనటిగా నటించింది. తెలుగులో ఈమెకి మంచి ప్రోత్సాహం ఇచ్చిన వారిలో డి.రామానాయుడు ఒకరు. ఆయన తన తనయుడు వెంకటేష్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీసిన ‘కలియుగ పాండవులు’ ద్వారా ఆమెని హీరోయిన్‌ని చేశాడు. ఆ తర్వాత ఆమె వరుసగా వెంకటేష్, నాగార్జున వంటి వారితో కలిసి ‘కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు, కిరాయి దాదా’ వంటి పలు చిత్రాలలో నటించింది. రాజేంద్రప్రసాద్‌తో చేసిన ‘పేకాట పాపారావు’ సమయానికి కోలీవుడ్‌లో ఆరాధ్యదేవతగా మారింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో శివాజీగణేషన్ తనయుడు ప్రభుతో ఆమెది హిట్ పెయిర్. ‘చిన్నతంబి’ (చంటి)నుంచి వరుసగా ఈ జంటకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఖుష్బాంగిక పేరుతో ఏకంగా ఆమెని దేవతని చేసి గుళ్లు కట్టి పూజలు చేశారు. ఆమె పేరు మీద ఇడ్లీ, వడ, సాంబారు వంటి ఉత్పత్తులను కూడా అమ్మడం ప్రారంభించేంతగా ఆమె హవా సాగింది.
ఆ సమయంలో ప్రభు ఆమెని వివాహం చేసుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ శివాజీగణేషన్ బలవంతంపై వారు విడిపోయారనేది కోలీవుడ్ టాక్. ఆ తర్వాత పలువురితో ప్రేమాయణం నడిపిన ఈమె దర్శకుడు సుందర్.సి.ని వివాహం చేసుకుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి ‘స్టాలిన్’, ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రాలతో పాటు తాజాగా త్రివిక్రమ్ -పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లో కూడా కీలకపాత్రను పోషించింది. ప్రస్తుతం తమిళంలో ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అది కూడా త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం.
పవన్‌కళ్యాణ్ పాత్రలో శింబు నటిస్తోన్న ఇందులో నదియా పాత్ర అయిన హీరోకి మేనత్త పాత్రను ఖుష్బూ పోషిస్తోంది. సమంత, ప్రణీతల స్థానంలో ప్రస్తుతం మేఘా ఆకాష్‌ని మాత్రమే ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు? అనేది తేలలేదు. మరి త్రివిక్రమ్ డైరెక్ట్ చిత్రం ‘అజ్ఞాతవాసి’తో హిట్ కొట్టలేకపోయిన లోటుని ఖుష్బూ త్రివిక్రమ్ సినిమా రీమేక్ అయిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ద్వారా అయినా సాధిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!