రాజకీయాలలో లీక్‌లనేవి నేడు కొత్తకాదు.. ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ఆ సమాచారం పక్కాగా తెలిసినవారు మీడియాకు, ఇతరులకు లీక్ ఇస్తూ ఉంటారు. తెలంగాణ విభజన సమయంలో కూడా దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ విద్యార్ధినాయకులతో సమావేశం అయిన మరునాడే రాష్ట్ర విభజనకు సోనియా అనుకూలంగా ఉండనున్నారని, రాష్ట్ర విభజన తప్పదని వార్తలు వచ్చాయి. ఇక ఏదైనా నాయకుడు పార్టీ మారుతున్నా కూడా ఇలాంటి వార్తలే వస్తూ ఉంటాయి. కేసీఆర్ ఆమరణ దీక్ష మొదలుపెట్టి విరమించే సమయానికే తెలంగాణ ఓకే అయిపోయింది. ఇక పలు స్వతంత్య్ర వ్యవస్థలకు చెందిన వారి నుంచి కూడా ఇలాంటి లీకులే వస్తూ ఉంటాయి. ఉదాహరణకు జగన్‌కి ఇంకా ఫ్యాన్ గుర్తును ఎన్నికల సంఘం ఇవ్వకముందే ఫ్యాన్ గుర్తుతో కూడిన ప్రచార సామగ్రి రెడీ అయిపోయింది.
కాబట్టి మనదేశంలో ఏదీ అసాధ్యం కాదు. కావాలంటే కాస్త సహనం, పరిచయాలు ఉండాలి అంతే. ఇక హీరో శివాజీ విషయానికి వస్తే ఒకప్పుడు టీవీ9 ఈయనకు పెద్ద పీట వేసింది. ఈయన బిజెపిలో చేరి, ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. శివాజీ ఆమద్య కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్‌గరుడను చేపట్టిందని చెప్పి, ఆ ఆపరేషన్ గరుడ అంటే ఏమిటో పూర్తిగా వివరించాడు. కర్ణాటక ఎన్నికల్లో కూడా అదే అటు ఇటుగా జరిగింది. ఇక తాజాగా ఆయన త్వరలో చంద్రబాబునాయుడుకి నోటీసు రానున్నాయని, ఇది తనకు ఢిల్లీ నుంచి వచ్చిన పక్కా సమాచారం అని తెలిపాడు. ఇప్పుడు తన వల్ల అది బయటపడటంతో కాస్త ఆలస్యం కావచ్చని, కానీ నోటీసులు రావడం మాత్రం పక్కా అని బల్లగుద్ది మరీ చెప్పాడు. కొంతమంది శివాజీని లైట్‌గా తీసుకున్నారు. శివాజీనే కాదు.. ఆంధ్రజ్యోతి కూడా ఇదే విషయాన్ని ముందుగానే తెలిపింది.
ఇప్పుడు చంద్రబాబుకి ఎనిమిదేళ్ల నాటి బాబ్లీ కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో శివాజీ మాటలకు మరింత ప్రాధాన్యం పెరగడం ఖాయమనే చెప్పాలి. మనసుంటే మార్గముంటుంది అనే సామెత ప్రకారం ఈ సమాచారాన్ని తెలుగుదేశం నాయకులే కేంద్రానికి భయపడి శివాజీకి ఉప్పందిస్తున్నారా? లేక మరెవ్వరైనా భయపడి శివాజీని తెరపైకి తెస్తూ విషయాలను లీక్ చేస్తున్నారా? అసలు ఈ విషయాలు శివాజీకి ఎలా తెలుస్తున్నాయి? అనే అనుమానపు ప్రశ్నలు రావడం ఖాయం. మొత్తానికి శివాజీకి మాత్రం మంచి నెట్‌వర్క్ ఉందనే విషయం ఆయనను దగ్గరగా చూసిన వారికెవ్వరికైనా ఖచ్చితంగా అర్ధమవుతుంది.