ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజాహెగ్డే కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై ఎస్.రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'. దీనిని విజయ దశమి కానుకగా వచ్చేనెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హఠాన్మరణంతో ఈ చిత్రం ఆడియో వేడుక ఉండదని అందరు భావించారు. ఇప్పటికే ఈ ఆడియో వేడుక పలు సార్లు వాయిదా పడింది. అయితే చిత్ర యూనిట్ మాత్రం 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రం ఆడియో ఈనెల 20న విడుదల చేస్తున్నట్లుగా ఓ పోస్టర్‌తో తెలిపింది. దాంతో ఈ చిత్రం ఆడియో వేడుక ఉంటుందేమో అని యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించారు.
అయితే చిత్ర యూనిట్ 20వ తేదీన ఆడియో విడుదల అని ప్రకటించిందే గానీ ఆడియో వేడుక ఉంటుందా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆడియో వేడుకను జరపడం లేదు. 20వ తేదీన ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'అనగనగా' అనే లిరికల్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్స్, టీజర్లలో ఎన్టీఆర్ లుక్స్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు.
కాగా దీని ద్వారా సంగీత దర్శకుడు థమన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మొదటి సారి కలిసి పనిచేస్తుండటం విశేషం. ఇందులో కేవలం నాలుగు పాటలే ఉంటాయని వార్తలు వస్తున్నాయి. రెండు డ్యూయెట్స్, ఒక సోలో సాంగ్, మరో బ్యాగ్రౌండ్ సాంగ్‌లు ఉంటాయట. సో... 20వ తేదీన ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసి సినిమా విడుదలకు ఓ ఐదారురోజుల ముందుగా ప్రీరిలీజ్ వేడుకను మాత్రం ఘనంగా నిర్వహించనున్నారు.