ప్రస్తుతం మీడియా సెన్సేషన్ కోసమే ప్రయత్నాలు చేస్తోంది గానీ సమస్యలపై సరిగా స్పందించడం లేదు. ఏదో ఒక రూపంలో సంచలన వార్తలను రాబట్టడమే మీడియాకు ప్రధమ ప్రాధాన్యంగా మారింది. అందులోనూ ఏదైనా సంచలన వ్యాఖ్యలను ప్రముఖుల నోటి నుంచి రప్పించి, దానిపై విశ్లేషణలు, చర్చలు, రచ్చలు పెడుతున్నారు. దాంతో సమయం, సందర్భం లేకుండా మీడియా ప్రతినిధులు ప్రముఖులను ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొందరు సున్నితంగా వాటికి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఆ అసందర్భ ప్రశ్నలు వేసేవారిని కడిగేస్తూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే ఇటీవల ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం విలవిలలాడింది. ఈ దారుణ ఘటనలో పూర్తిగా దెబ్బతిన్నవెల్లింగ్టన్ ద్వీపాన్ని మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సందర్శించాడు. అక్కడకు విచ్చేసిన మీడియా బృందంలోని ఓ వ్యక్తి ఇటీవల జరిగిన కేరళ సన్యాసిపై జరిగిన అత్యాచారంపై స్పందించాల్సిందిగా మోహన్‌లాల్‌ని కోరాడు. దీంతో ఆగ్రహించిన మోహన్‌లాల్ 'ఇటువంటి సమయంలో అనవసర ప్రశ్నలు అడుగుతున్నారు. సిగ్గులేదా? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి, రేప్ సంఘటనకు మధ్య సంబంధం ఏమిటి? ఆపద సమయాల్లో చేయాల్సిన సహాయ కార్యక్రమాలను పక్కనపెట్టి, ఇలాంటి అసందర్భపు ప్రశ్నలు వేయడం దేనికి? అని మండిపడిన సూపర్‌స్టార్ ఆ తర్వాత పాల్గొనవలసిన విలేకరుల సమావేశంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.