సాధారణంగా సినిమాలలో వాడే కొన్ని పదాలు జనబాహుళ్మంలోకి కూడా ఊతపదాలకు వచ్చి చేరుతాయి. సుత్తి, జఫ్ఫా వంటి పదాలు అటువంటివే. సాధారణంగా జఫ్ఫా వంటి పదాలకు ఏ అర్ధం ఉండదు. కానీ సౌండింగ్ బాగా ఉండి ఏదైనా బూతుకి బదులు కొత్త పదాన్ని కనుగొని వాడటం వల్ల అవి ప్రేక్షకుల ఆదరణను చూరగొంటాయి. ఇక ఆ మద్య సినీ వజ్రోత్సవాల సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులైన కె.యస్.రామారావు వంటి వారిని మోహన్‌బాబు ‘సిల్లీ ఫెల్లోస్’ అన్నాడు. నాడు ఈ పదం బాగా పాపులర్ అయింది. చివరకు మోహన్‌బాబు ఎవరిపైనైతే ఆ వ్యాఖ్యలు చేశాడో అదే నిర్మాత కె.యస్.రామారావు నిర్మాతగా ప్రభాస్, త్రిష, మోహన్‌బాబులతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లో మోహన్‌బాబుకే దానిని ఊతపదంగా వాడారు.
తాజాగా మోహన్‌బాబు ఇండియాటుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఫసక్’ అనే పదం వాడాడు. ఇది కూడా విపరీతంగా పాపులర్ అయింది. బాగా అర్ధం చేసుకున్న వారికి ఓ ఆంగ్ల బూతు పదం బదులుగా దానిని వాడినట్లు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ ‘ఫసక్’ అనే పదానికి పేరడీలుగా వేలాది వీడియోలు తయారయ్యాయి. త్వరలో ఇదే ‘ఫసక్’ టైటిల్‌తో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. గతంలో నాగబాబు వాడిన ‘అక్కుపక్షి’ తరహాలో ‘ఫసక్’ ఫేమ్ అయింది. ఇక విషయానికి వస్తే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయిన ఈ పదం గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ స్పందించింది.
ఈ ‘ఫసక్’ అంటే ఏమిటి? ఇలాంటి పదాన్ని నేనెప్పుడు వినలేదు. ఇప్పుడు ప్రతిచోటా వినిపిస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీనిని గమనించిన మోహన్‌బాబు చిన్నతనయుడు మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చాలా భావోద్వేగాలతో కూడిన రియాక్షనే ఫసక్. నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు.. పూర్తిగా అర్ధమేలేదనుకుంటే దండించు.. ఫసక్’ అని పెదరాయుడు చిత్రంలో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్ పేరడీతో ఈ ట్వీట్ చేయడం మంచు మనోజ్ సమయస్ఫూర్తికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ పేరడీ ట్వీట్‌పై ప్రస్తుతం జోక్‌లు పేలుతున్నాయి. మనోజ్‌కి రిప్లై ఇచ్చిన నిధి అగర్వాల్ ‘మనోజ్.. నేనిప్పుడు ఫసక్ ఎమోషన్‌తో పూర్తిగా కనెక్ట్ అయ్యాను...’ అంటూ రిప్లై ఇచ్చింది.