నాగార్జున నటునిగా కంటే నిర్మాతగా ఇంకా ఆచితూచి అడుగులువేస్తూ ఉంటాడు. ‘హలో’ చిత్రం కోసం విక్రమ్ కె.కుమార్ చేత ఎన్నికథలు తయారు చేయించాడో ఆయనకే తెలియదు. ఇక ఈయన సక్సెస్‌ని బట్టి నిర్మాతగా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక విషయానికి వస్తే తాజాగా నాగార్జున పెద్దకుమారుడు నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ ద్వారా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. నాడు నాగార్జున సరసన హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇందులో చైతుకి అత్తగా నటించింది. మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం కేవలం యావరేజ్ టాక్‌ని తెచ్చుకుంది. దీని కంటే అదే రోజు విడుదలైన సమంత చిత్రం ‘యూటర్న్’ పెద్ద హిట్ దిశగా సాగుతోంది. అత్తాఅల్లుళ్ల పోరుగా తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కంటే నాడు నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ని డిటిఎస్ చేసి చూస్తే అదే బాగుండేదని ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు.
ఇక అత్తగా రమ్యకృష్ణ ఎన్నో అంచనాలు పెట్టకుని చేసిన ఎన్టీఆర్ ‘నా అల్లుడు’తో పాటు ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా ఆమెకి బాధాకరమైన ఫలితాన్నే అందించిందని అంటున్నారు. అయితే ఇక్కడ మరో పాయింట్ ఉంది. ఈ చిత్రం కేవలం మీడియం బడ్జెట్‌తో రూపొందింది. దీంతో వినాయకచవితి పండగ నేపధ్యంలో ఈ చిత్రం సేఫ్‌జోన్‌లోకి రావడం ఖాయమనే మాట వినిపిస్తోంది. మొత్తానికి భార్యాభర్తల పోరులో భార్య సమంతనే విజయం సాధించిందని చెప్పాలి. మరోవైపు ఇంకో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేసి విధానం నచ్చిన నాగార్జున.. మారుతి తదుపరి చిత్రాన్ని తమ అన్నపూర్ణ బేనర్‌లోనే తీయాలని భావిస్తున్నాడట. దీనికి సంబంధించి మారుతికి అడ్వాన్స్ కూడా ముట్టజెప్పారని తెలుస్తోంది.
అయితే మారుతి ప్రస్తుతం గీతాఆర్ట్స్, యువిక్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో ఉంచాడు. నాగచైతన్య కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. బహుశా అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ తర్వాత మారుతితో చిత్రం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి మారుతి ‘మహానుభావుడు’ చిత్రాన్ని అఖిల్‌తోనే చేయాలని భావించాడు. కానీ ‘హలో’ బిజీ వల్ల అందులో శర్వానంద్ నటించాడు.