తన కెరీర్‌లో ‘మగధీర’ తప్ప మరో వెరైటీ చిత్రం చేయని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మూసకొట్టుడు చిత్రాలతో వరుస పరాజయాల పాలవుతున్న సమయంలో తమిళ ‘తని ఒరువన్’కి రీమేక్‌గా వచ్చిన ‘ధృవ’ చిత్రంతో వెరైటీ చిత్రాల బాట పట్టాడు. ఆ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన నేటి స్టార్ హీరోలలోనే ముందుగా తానే ఓ అడుగు ముందుకేసి సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ యువకుడిగా ‘రంగస్థలం’ చిత్రం చేశాడు. ఈ చిత్రం టైటిల్‌ని, కథాంశాన్ని చూచాయగా తెలుసుకున్న అభిమానులే కాదు.. రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దని వారించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రామ్‌చరణ్ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సుకుమార్‌పై నమ్మకంతో ‘రంగస్థలం’ చిత్రం చేశాడు.
ఈ చిత్రం సాధించిన విజయం, పొందిన ప్రశంసలు అన్ని ఇన్నికావు. ఇతర స్టార్ హీరోలను కూడా ఈ తరహా ప్రయోగాలు చేయడానికి సరైన స్ఫూర్తిని నింపిన చిత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. హీరో చెవిటి వాడుగా నటించడం అంటే అది ఎంతో ఇమేజ్ ఉన్న రామ్‌చరణ్‌కి చిన్న విషయం కాదు. ఇక ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి, దేశవిదేశాలలో అత్యద్భుత విజయాన్ని అందించింది. ఈ చిత్ర విజయంలో సమంత, అనసూయలతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి కూడా కీలకమైన హస్తం ఉంది. దేవిశ్రీ ఈ చిత్రానికి అందించిన పాటలన్నీ విపరీతంగా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ తెగనచ్చేశాయి.
ముఖ్యంగా సమంత మెయిన్‌గా వచ్చిన ‘రంగమ్మా.. మంగమ్మా.. ఏం పిల్లడూ.. పక్కనే ఉంటాడమ్మా.. పట్టించుకోడు’ పాట అయితే సినిమాలోని ఇతర పాటల కన్నా కూడా ఎక్కువగా పాపులర్ అయింది. ఈ ఏడాది అవార్డులన్నీ ఈ చిత్రానికే అన్న నమ్మకాన్ని ఇది అందరిలో కలిగించింది. ఇక తాజాగా ‘రంగస్థలం’లోని ‘రంగమ్మా.. మంగమ్మా’ పాట యూట్యూబ్‌లో మరో రికార్డును నెలకొల్పింది. ఈ పాట అతి తక్కువ సమయంలో 10కోట్ల వ్యూస్‌ని రాబట్టిన సాంగ్‌గా రికార్డు సృష్టించింది. దర్శకుడుసుకుమార్ 1985 బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో మరెన్ని చిత్రాలు రానున్నాయో ఎదురు చూడాల్సివుంది...!