మన సినీ పెద్దలు ఒకొక్కరి విషయంలో ఒక్కోరకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ సమన్యాయం అనేది వారి నిర్ణయాలలో కనిపించదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అనే చందంగా వారి వ్యవహారం ఉంటుంది. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాలలో అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంటుంది. 'జబర్ధస్త్' షోనే ఉదాహరణగా తీసుకుంటే నాగబాబు జడ్జిగా ఉండే ఈ షోలో మెగా ఫ్యామిలీ హీరోలను తప్ప మిగిలిన అందరి హీరోలను వెటకారం చేస్తూ స్కిట్స్ చేస్తూ ఉంటారు. వాటికి నాగబాబు, రోజాలు పగలబడి నవ్వుతూ, చప్పట్లతో ఉత్సాహ పరుస్తారే గానీ ఖండించే ప్రయత్నం కూడా చేయరు. ఇక గతంలో చిరంజీవితో పాటు మెగా హీరోలపై పలువురు సినీ ప్రముఖులు, ఇతరులు నానా అసందర్భ ప్రేలాపనలు పేలారు. కానీ వారిని కనీసం అలా మాట్లాడటం తప్పు అని ఖండించిన వారు కూడా లేరు అంతెందుకు ఇటీవలే పవన్‌కళ్యాణ్‌ని టార్గెట్ చేసి, ఆయనేదో పెద్దరికంతో అన్న మాటలను శ్రీరెడ్డి, కత్తిమహేష్ వంటి వారు నానా యాగీ చేశారు.
బాలకృష్ణ మీడియాను బండబూతులు తిట్టినా, అభిమానులను కొట్టినా, ఆడవారికి కడుపు చేయమని చెప్పినా ఈ పెద్దల గొంతులు మాగబోయాయి. అదే ఏదో తమాషాగా సినీ రంగంలో పెద్దగా, అందరు బాబాయ్ అని పిలుచుకునే చలపతిరావు ఒక్క మాటలో తేడా వస్తే నానా హంగామా చేశారు. ఇక తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మనోజ్ ప్రభాకర్ మాటలపై ప్రిన్స్ అభిమానగణం మండిపడింది. ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించడంతో మనోజ్ ప్రభాకర్ కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాడు. కానీ మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగానూ సమర్ధనీయం కాకపోవడంతో 'మా' అసోసియేషన్ నుంచి నడిఘర్ సంఘానికి ఓ లేఖ వెళ్లింది. మహేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నడిఘర్ సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలన్నదే ఈ లేఖ సారాంశం. దీనిపై చెన్నైలోని నడిఘర్ సంఘం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది..! అయితే 'మా' రాసిన లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో పవన్‌పై శ్రీరెడ్డి, కత్తిమహేష్‌లు ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు, కేవలం పవన్‌ని క్రేజ్ కోసం శ్రీరెడ్డి ద్వారా తానే వివాదంలోకి లాగానని తెలుగు సినీ ప్రముఖుడైన వర్మ తానే ఒప్పుకున్నాక కూడా దీనిపై మన పెద్దలు ఎందుకు మౌనం వహించారు.? కోనవెంకట్ వంటి వారు తప్పితే ఆ రోజున మిగిలిన మా పెద్దలు ఏమి చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఉదయించక మానవు. అయితే పవన్ విషయంలో రాజకీయ కోణం కూడా ఉండబట్టే మన పెద్దలు మౌనం వహించారని, కానీ మహేష్ పరిస్థితి అది కాదని కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.