ఏదైనా సంస్థలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఈ సంస్థకే చెందిన ఇద్దరు ప్రముఖులు రోడ్డున పడితే వారు ముందుగా సమాధానం చెప్పాల్సింది ప్రజలు, అనుమానాలు ఉన్న ప్రేక్షకులకు మాత్రమే. అంతేగానీ మధ్యవర్తిత్వం పేరుతో రోడ్డున పడ్డవారు తిరిగి భాయ్ భాయ్ అనుకున్నంత సులువుగా ఆ సంస్థపై ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు, అపోహలు తీరిపోవు. వాటిలోని నిజాయతీని, జరిగిన తప్పొప్పులు, ఎందువల్ల అభిప్రాయ భేధాలు వచ్చాయనే విషయాన్ని అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అంతేగానీ తమ పరువు వీధిన పడుతోందని చెప్పి, పలువురు పెద్దలు జోక్యం చేసుకుని దానికి మసిపూసి మారేడు కాయని చేసి, అసలు ఏమి జరగలేదు? అని చెప్పడం రాజకీయం కాక మరేమిటి? ప్రజలకు, ప్రభుత్వాలకు జవాబుదారీగా ఉండాల్సిన సంస్థలు కూడా కోట్ల కుంభకోణ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు తమలో తాము రాజీ పడి మేము ముందు చెప్పిందంతా తూచ్ అనడం సరైన విధానం కాదు. వాటివల్ల సంస్థ గుడ్‌విల్ పెరగదు కదా...! మరింతగా దిగజారుస్తుంది. అందులో ఇకపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని అందరు అనుమానపు దృష్టితో చూడటం మామూలై పోతుంది.
ఇక విషయానికి వస్తే మా సిల్వర్‌జూబ్లీ వేడుకలు అమెరికాలో నిర్వహించిన సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్‌లు విడివిడిగా ప్రెస్‌మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నరేష్ నిధుల్లో అక్రమాలు జరిగాయని, నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాడు. ఐదు పైసలు దుర్వినియోగం జరిగినట్లు నిరూపించిన తన ఆస్థిని మొత్తం రాసిస్తానని శివాజీరాజా సవాల్ విసిరాడు. మరి ఈ నిజనిర్ధారణ కమిటీ ఏమైందో తెలియదు గానీ మొత్తానికి శివాజీరాజా, నరేష్‌ల మధ్య రాజీ కుదిరింది. సినీ పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ప్రతి సంస్థలో ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. రెండు వర్గాలు ప్రెస్‌మీట్ పెట్టి తప్పు చేశాయి. ఇకపై ఈ విషయాలన్నీ సెలక్టివ్ కమిటీనే చూసుకుంటుంది. 'మా'లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన సెలక్టివ్ కమిటీలో తేలింది. ఇకపై మీడియాతో కలెక్టివ్ కమిటీనే మాట్లాడుతుంది అని చెప్పారు.
శివాజీ రాజా మాట్లాడుతూ, చిన్న మనస్పర్దలు వచ్చిన మాట నిజమే. అన్ని విషయాలను కలెక్టివ్ కమిటీ ముందు ఉంచాం. అవకతవకలు జరగలేదని తేలింది అని చెప్పుకొచ్చాడు. నరేష్ మాట్లాడుతూ, ఏ సంస్థలో అయినా బేధాభిప్రాయాలు రావడం సహజమే. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్‌ని కలిసికట్టుగా విజయవంతం చేస్తామని గతం గత: అని అన్నాడు.