ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య 'క్యాన్సర్ మహమ్మారి'. మిగిలిన వారి సంగతి పక్కనపెడితే క్యాన్సర్ మూలంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఎందరో సినీ ప్రముఖుల జీవితాలు మనకి తెలుసు. తొలిదశలోనే గుర్తించి జాగ్రత్తలు చెప్పడం తప్ప ఎవ్వరూ ఏమి చేయలేని ఈ మహమ్మారి బారిన పడిన నేటితరం వారి విషయానికి వస్తే క్రికెటర్ యువరాజ్‌సింగ్ నుంచి గౌతమి, మమతామోహన్‌దాస్ వంటి వారి పేర్లు చెప్పుకోవచ్చు. అయితే క్యాన్సర్‌ని అధిగమించే మార్గం ఏమిటంటే.. బలమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. అంతేకాదు.. దీని బారిన పడిన వారికి మనోస్థైర్యం, జీవితంపై పోరాడే తత్వం కూడా ఉంటే దీనిని జయించడం పెద్దగా కష్టమేమీ కాదని డాక్టర్లు చెబుతూ ఉంటారు.
కానీ ఎంతో చదువు, అవగాహన ఉన్న సినీ ప్రముఖులు సైతం దీనిని మొదటి దశల్లో గుర్తించలేక పోతుండటం విచారించదగ్గ విషయం. అలా క్యాన్సర్ తీవ్రంగా వ్యాపించే వరకు గుర్తించలేకపోయిన నటి సోనాలి బింద్రే. ఈమె పలు తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్‌గా అలరించింది. తాజాగా ఈమె మరణించిందని పలు పుకార్లు వస్తే వాటిని నమ్మి ఓ బిజెపి ఎమ్మెల్యే సైతం శ్రద్దాంజలి ప్రకటించేశాడు. ఇక విషయానికి వస్తే సోనాలిబింద్రే వినాయక చవితి సందర్బంగా ప్రజలందరికీ ఓ ట్వీట్ చేసింది. నాకు దేవుని ఆశీస్సులు తోడుగా ఉన్నాయి. ఈ ఏడాది వినాయక ఉత్సవాలు జరుపుకోలేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది. నా కుమారుడు ఆ లోటును తీర్చాడు.
ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపింది. హైగ్రేడ్ మెటాస్టేటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ అందాల సుందరి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్సను పొందుతున్న సంగతి తెలిసిందే. తల్లి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ఆమె కుమారుడు రణవీర్ పూజలు చేసి ఆ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీనిపై సోనాలి పై విధంగా స్పందించింది. ఆ వినాయకుని ఆశీస్సులతోనైనా సోనాలి క్యాన్సర్ నుంచి బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.