టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి కళాకండాన్ని ఐదేళ్లు శ్రమించి మరీ తెరకెక్కించాడు. శ్రమకు తగ్గ ఫలితం దర్శకుడు దగ్గర నుండి టెక్నీషియన్ వరకు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఏ పాత్ర అయినా బలంగా రాసుకోవడం.. ఆ పాత్రకు తగ్గ నటనతో ఆయా క్యారెక్టర్స్ చేసిన నటీనటులు చెలరేగిపోయి నటించడంతో సినిమా ఆ రేంజ్ హిట్ అయ్యింది. బాహుబలిలో శివగామిగా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ఈ సినిమాలో అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చింది. ముందుగా శ్రీదేవిని శివగామి పాత్రకు అనుకున్న రాజమౌళి అనుకోకుండా రమ్యకృష్ణకి ఆ పాత్ర ఇవ్వడం శివగామిగా రమ్యకృష్ణ సత్తా చాటడం జరిగింది. ఇది నా మాట.. నా మాటే శాసనం అంటూ శివగామిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ రాజమాతగా అదరగొట్టింది. రీ ఎంట్రీతో టాలీవుడ్ కి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని రాజమౌళి ఇచ్చాడన్నారు.
అయితే రమ్యకృష్ణ మాత్రం బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి హిట్ అందుకోలేకపోయింది. మధ్యలో రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ... తాజాగా విడుదలైన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో శైలజ రెడ్డిగా పవర్ ఫుల్ అత్తగా రమ్యకృష్ణ కనబడింది. అయితే బాహుబలిలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ ఈ శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో తేలిపోయింది. ముందుగా అంటే శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్ చూసినప్పుడు రమ్యకృష్ణ ఈ సినిమాలో అత్తగా కేక పుట్టిస్తుంది అనుకుంటే.. సినిమాలో శైలజా రెడ్డి క్యారెక్టర్ ని దర్శకుడు మారుతీ వీక్ చేసి పారేశాడు. శైలజా రెడ్డిగా పవర్ ఫుల్ అత్తగా కనిపిస్తుంది అనుకున్న ప్రేక్షకులకు సినిమా చూశాక నిరాశే కలిగింది. రమ్యకృష్ణ గురించి గొప్పగా ఊహించుకుని వెళ్లిన ప్రేక్షకుడు బయటికి ఉసూరుమనుకుంటూ వచ్చారంటేనే ఆమె క్యారెక్టర్ ఎంతగా నప్పలేదో తెలుస్తుంది.
ఈగో కి బ్రాండ్ అంబాసిడర్ గా శైలజా రెడ్డి గా ఆడవాళ్ళ ఫేస్ చేస్తున్న సమస్యలతో .. మగవాళ్ళను బానిసల్లాగా చూస్తూ... చివరికి కట్టుకున్న భర్త(నరేష్) నే లెక్కచెయ్యని పొగరుబోతు క్యారెక్టర్ లో శైలజా రెడ్డి పేరుతో హుందాగా ఆకట్టుకున్నా.. ఆమె క్యారెక్టర్ మాత్రం పేలవంగా మారింది. ఇక శైలజా రెడ్డి అల్లుడు సినిమాకి యావరేజ్ టాక్ రావడం కూడా రమ్యకృష్ణకి కాస్త మైనస్ అయ్యింది. మరి రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్ర అంటే బాహుబలిలో శివగామినే ఊహించుకుంటే మాత్రం ప్రేక్షకుడు ఎంతగా నిరాశ చెందుతాడో అనేది శైలజారెడ్డి లో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ ని చూస్తే తెలుస్తుంది.