తెలుగు స్టార్ హీరోలకు వారి క్రేజ్, ఇమేజ్, ఫ్యాన్స్ కోరుకునే విధంగా పంచభక్ష పరమాన్నాల వంటి అన్ని అంశాలను జోడించి, అచ్చ తెలుగు భాషలో కూడా తమదైన రోమాలు నిక్కబొడుచుకునేటు వంటి కథలు, డైలాగ్‌లు అందించడంలో పరుచూరి బ్రదర్స్‌కి ఎవ్వరూ సరిరారు. రెండు మూడు చిత్రాలకే కలంలోని సత్తానంతా పోగొట్టుకుని పేలవమైన డైలాగ్‌లు రాసే వారికి ఇంత లాంగ్‌స్టాండింగ్‌లో పరుచూరి బ్రదర్స్ దాదాపు మూడు తరాలకు సక్సెస్‌ఫుల్ రైటర్స్‌గా పనిచేయడం అనేది మాటలు కాదు. ఇక వీరు అటు మెగాఫ్యాన్స్‌కి, నందమూరి ఫ్యాన్స్‌కి కూడా నచ్చే డైలాగులను, కథలను ఏకకాలంలో అందించి ఇద్దరు అభిమానులు చేత ఈలలు వేయించడం అంటే మాటలు కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కాబట్టే వారు రచయితలు అగ్రజులుగా చెప్పాలి.
చిరంజీవికి 'ఘరానామొగుడు, ఇంద్ర'వంటి ఎన్నో చిత్రాలలో ఎంత పవర్‌ఫుల్ డైలాగ్స్‌ని అందించారో బాలకృష్ణ నటించిన 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు' వంటి వాటికి కూడా అదే మోతాదులో సంభాషణలు అందించారు. ముఖ్యంగా కథ వారే ఇవ్వకపోయినా కూడా తమకిచ్చిన బాధ్యతలను 100శాతం నెరవేర్చడం వారికే చెల్లింది. ఇక చిన్నికృష్ణ కథను అందించగా బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'నరసింహనాయుడు' చిత్రం తెలుగు తెరపై వచ్చిన పవర్‌ఫుల్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం గురించి పరుచూరిగోపాలకృష్ణ చెబుతూ, 'ఆరోజు నరసింహనాయుడులోని ఒక సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్‌తో చిత్రానికి గుమ్మడికాయ కొట్టనున్నారు. అదే సమయంలో బి.గోపాల్ వచ్చి సార్ ఇది సినిమాలో ఆఖరి సీన్‌గా వస్తుంది. బాలకృష్ణకి ఏదైనా పవర్‌ఫుల్ డైలాగ్ పడుతుందేమో చూడండి.. అని అన్నారు.
'సమరసింహారెడ్డి'లోని 'తొడగొడితే దాని సౌండ్‌కి చనిపోతావ్' తరహాలో అంత పవర్‌ఫుల్‌గా ఉండాలని కోరాడు. అప్పుడు మేము రాసిన డైలాగే 'ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.... కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా'.. అని రాశాను. ఆ డైలాగ్ వినిపించగానే బి.గోపాల్ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ డైలాగ్‌ని ఇప్పటికీ పిల్లలు చెప్పుకుంటూ ఉండటం విశేషం' అని చెప్పుకొచ్చారు.