ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుధీర్‌బాబు బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాడు. తనదైన శైలిలో వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా 'ప్రేమకథా చిత్రమ్, భలే మంచిరోజు'తో పాటు తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన నటించిన 'సమ్మోహనం' చిత్రం మంచి హిట్‌ని సాధించింది. ఈ చిత్రంతో సుధీర్‌బాబు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఇక ఈయన తాజాగా సొంతగా నిర్మాతగా కూడా మారి తానే హీరోగా 'నన్ను దోచుకొందువటే' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన విడుదల కానుంది. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్రం ప్రమోషన్స్‌లో ఉన్న సుధీర్‌బాబు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఒకరోజున ఆర్.ఎస్.నాయుడు నా వద్దకు వచ్చి కథ వినిపించాడు. కానీ రిజెక్ట్ చేసి పంపి వేశాను. ఆ తర్వాత డైలాగ్ వెర్షన్‌తో, ట్రీట్‌మెంట్‌తో ఒక బౌండ్ స్క్రిప్ట్ ద్వారా మరో వ్యక్తి నుంచి నాకు ఇది వచ్చింది. ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో నేనే హీరోగా చేయడమే కాకుండా, సొంతగా నిర్మించాలని, ఈ చిత్రం ద్వారానే నిర్మాతగా కూడా మారాలని నిర్ణయించుకున్నాను. దర్శకుడిని పిలిపించమంటే ముందుగా నాకు కథ చెప్పిన ఆర్.ఎస్.నాయుడు రావడంతో నేను ఆశ్చర్యపోయాను. నాకు నచ్చని కథకి ఆ రూపం తేవడంలో ఆర్.ఎస్.నాయుడు చూపించిన ప్రతిభ నాకు నచ్చి ఆయనపై నమ్మకం పెంచింది. అలా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. నాకు ఈ చిత్రం మరో మంచి హిట్‌ని ఇస్తుందన్న నమ్మకం ఉందని సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు.
కొందరు దర్శకులు అద్భుతంగా కథ చెప్పలేరు గానీ అద్భుతంగా స్క్రిప్ట్‌ని తయారు చేసి తీయగలరు. ఈ కోవలోకి శేఖర్‌కమ్ముల, ప్రవీణ్‌సత్తార్ వంటి వారు వస్తారు. ఇక తెలుగు హీరోలకి స్క్రిప్ట్ సరిగా చదవడం చేతకాదని, స్క్రిప్ట్ చదువుతూనే విజువలైజ్ చేసుకోలేరనే అపవాదు ఉంది. వీటన్నింటికి సుధీర్‌బాబు ఫుల్‌స్టాప్ పెట్టాడనే భావించాలి.