ప్రజలను వెర్రివాళ్లను చేయడానికి బిగ్‌బాస్ వంటి షోలు వస్తూనే ఉంటాయి. అదేమంటే చూసే వారు చూస్తున్నారు. బాగా టీఆర్పీలు వస్తున్నాయి. ప్రజలు ఆదరిస్తుంటే మీకెందుకు బాధ అంటారు. కానీ ఇలాంటి షోల వల్ల కనీసం ఒకటైనా మేలు ఉందా? అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రజల అభిరుచిలో మార్పు వచ్చేంత వరకు ప్రజల వీక్‌నెస్‌తోనే ఇలాంటి కార్యక్రమాల నిర్వాహకులు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇక సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమే. కానీ ప్రకృతి పరంగా భగవంతుడు ఆడవారి శరీరం కంటే మగవారికి కాస్త బలం, దృఢత్వం ఇచ్చాడు. ఏ పని చేసేటప్పుడైనా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అథ్లెటిక్స్ నుంచి టెన్సిస్ వంటి ఆటల్లో కూడా మగవారి కంటే ఆడవారి రికార్డులు సపరేట్‌గా ఉంటాయి. పురుషులు సాధించిన రికార్డులనే మహిళలు సాధించాలంటే వీలు కాదు. టెన్నిస్‌లో అయితే సెట్స్ సంఖ్యలో కూడా మహిళలకు తక్కువ ఉంటాయి.
ఇక విషయానికి వస్తే ప్రముఖ రచయిత, తెలుగు పరిశ్రమలోని అత్యంత సీనియర్ అయిన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా బిగ్‌బాస్2పై సున్నిత పదాలతోనే ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్2లో జరుగుతున్న కొన్ని సంఘనలను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. స్త్రీ..పురుషులు ఆకాశంలో సగం.. జనాభాలో సగం. కానీ శరీర నిర్మాణం, 'శక్తి' విషయాలలో మాత్రం వారు సగం.. వీరు సగం కాదనే విషయం తెలిసిందే. అలాంటిది బిగ్‌బాస్2లో స్త్రీ, పురుషులు ఇద్దరికీ కలిపి పోటీలు పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. స్త్రీ, పురుషులను కలిపి పరుగెత్తించారు. అలా పరుగెడుతూ కొందరు అమ్మాయిలు పడిపోయినప్పుడు నాకెంతో బాధ వేసింది.
ఇక ఇటీవల కారులోంచి ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులను బలవంతంగా బయటకు నెట్టేయడానికి ప్రయత్నించడం నాకు చాలా బాధని కలిగించింది. బలవంతులు, బలహీనులను నెట్టేసి గెలవడం క్రీడాధర్మం కాదు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో.. దేవతలు అక్కడ కొలువై ఉంటారు.. అనే విషయాన్ని బిగ్‌బాస్2టీం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక కౌశల్ ఆర్మీని సైతం బిగ్‌బాస్ వారే క్రియేట్ చేసి ప్రచారం పొందుతున్నారని వార్తలు, సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. టీఆర్పీల కోసం మరీ ఇంత దిగజారాలా? అనేది ఆలోచించాల్సిన విషయం.