ఒక సినిమా ముక్తకంఠంతో ప్రేక్షకులందరికీ ఎందుకు నచ్చదు? అసలు దర్శకులు అయ్యే వారికి ఉండాల్సిన కనీస అర్హతలు ఏమిటి? ప్రేక్షకులలోనే భేదాభిప్రాయాలు, భిన్నమైన ఓపీనియన్స్ ఉన్నప్పుడు మీడియా మాత్రం ముక్తకంఠంతో బాగుందని చెప్పడం సాధ్యమా? పెట్టుబడి పెట్టే బకారా నిర్మాతలను పలు ఆశలు, బురిడీలు కొట్టించి ఒప్పించినంత మాత్రాన.. ఈ చిత్రాన్ని తీసినంత మాత్రాన దర్శకులై పోతారా? వరుస విజయాలు సాధించిన దాసరి, రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్ వంటి వారు ఎంతో కాలంగా ఎన్నో చిత్రాలు తీస్తూ శతాధిక చిత్రాలు తీసినా కూడా మీడియా మాటలకు విలువ ఇచ్చేవారు. కానీ నేటి నడమంత్రపు సిరిలా ఒక్క సినిమా బాగుందని టాక్ వచ్చిన వెంటనే ఆయా దర్శకులు తామేదో అతీతులమని భావిస్తున్నారు. వంశీ, కృష్ణవంశీ, మణిరత్నం వంటి మహామహులే మట్టికరుస్తున్నారు. 'అంకురం' వంటి చిత్రం తీసిన ఉమామహేశ్వరావు, రక్షణ, జైత్రయాత్ర వంటి చిత్రాలు తీసిన ఉప్పలపాటి నారాయణరావు, 'కళ్లు' వంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన ఎం.వి.రఘు వంటి వారు కూడా వన్ మూవీ వండర్స్‌గా మారారు.
ఇక విషయానికి వస్తే తాజాగా అందరు కొత్తవారితో రూపొందించబడిన 'కేరాఫ్ కంచరాపాలెం' చిత్రం ఓ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినీ ప్రముఖుల నుంచి విమర్శకులు, విశ్లేషకులు ఈ చిత్రాన్ని భుజాలపై పల్లకినీ మోసినట్లు మోశారు. ఒకటి రెండు వెబ్‌సైట్స్ తప్ప మిగిలిన అందరు ఇది గొప్ప చిత్రమనీ, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని, మొదటి సినిమాతోనే ఇంత అద్భుతంగా తీసిన వెంకటేష్ మహాని ఎంతో పొగుడుతున్నారు. ఆయన నుంచి ఇలాంటి ఆణిముత్యాలే రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల వరకు వెళ్లడంలో మీడియా, మరీ ముఖ్యంగా సోషల్‌మీడియా పోషించిన పాత్ర అత్యంత కీలకమైంది. కానీ ఈ చిత్ర దర్శకుడు వెంకట్ మహా మాత్రం వెబ్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రివ్యూలు ఇవ్వడానికి కొలమానం ఏమిటి? అలా ఉంటే ఒక్కో వెబ్‌సైట్‌కి తేడా ఎందుకు వస్తోంది? అని వ్యాఖ్యానించాడు.
'బాహుబలి' చిత్రం కూడా పూర్తిగా అందరినీ మెప్పించలేదనే విషయం ఆయనకు తెలియదా? అదేం చిత్రం? మా కాలంలో ట్రిక్ ఫొటోగ్రఫీ అన్నాం. నేడు గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌లు అంటున్నారు అని స్వయాన కైకాల సత్యనారాయణ, జమున వంటి వారే బాహుబలిని విమర్శించారు. ఇక ఈ చిత్రం పూర్తి రన్‌ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇక మీడియా అవసరం లేదనుకున్నాడో? లేక ఇలాగైనా పబ్లిసిటీ పొంది మరికొంత కలెక్షన్లు కొల్లగొట్టుకోవచ్చని భావించాడో గానీ వెంకట్ మహా వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండనీయం. గతంలో ఇలాగే వ్యాఖ్యానించిన పలువురు హీరోలు, దర్శకుల పరిస్థితి ఏమిటో వెంకట్ మహా ముందుగా తెలుసుకుంటే మంచిది.