'ఎన్టీఆర్' బయోపిక్ అనేది కేవలం ఎన్టీఆర్ కి సంభందించినది మాత్రమే కాదు.. ఇందులో ఎందరో ప్రముఖులు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల పాత్రలకు చోటుంది. అలా చూసుకుంటే ఇది పదిపదిహేను బయోపిక్‌లతో సమానం. ముఖ్యంగా నందమూరి తారకరామారావు, ఆయన అల్లుడు నారా చంద్రబాబునాయుడుల జీవితాలను ఒకే ఫ్రేమ్‌లో బంధించే బయోపిక్. దీనిపై ఎన్టీఆర్ మనవడు, బాలయ్య అల్లుడు, చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించాడు.
ఇద్దరు లెజెండరీల చరిత్రను తెరకెక్కించడం సాహసం. ఈ సాహసానికి పూనుకున్న బాలయ్య మావయ్యని, రానాని అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ అద్భుతమని నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఉన్న పోస్టర్‌ని టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ ట్విట్టర్‌లో స్పందించాడు. ప్రజల హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఇద్దరు వ్యక్తుల జీవితగాధను తెరకెక్కించడమే ఓ సాహసం. పైగా ఆనాటి పరిస్థితులను మరలా క్రియేట్ చేయడం అద్భుతం. బాలయ్య మామయ్య, రానా, చిత్ర టీం పడుతోన్న కష్టానికి ఈ పోస్టర్ ఓ నిదర్శనం... అని లోకేష్ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు భుజంపై చేయి వేసి ఉన్న ఫొటో పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా, నిజజీవితంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ చేయి వేసి మాట్లాడుతున్నఅరుదైన ఒరిజినల్ స్టిల్‌ని లోకేష్ పోస్ట్ చేశాడు. ఎన్‌బికే ఫిల్మ్స్ బేనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.