లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తానన్నది రజనీ స్టైల్. ఆయన సరైన చిత్రం చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూసి చాలా కాలం అయింది. 'చంద్రముఖి, శివాజీ, రోబో' చిత్రాల తర్వాత ఆయనకు అంత పెద్ద హిట్ మరలా రాలేదు. 'కథానాయకుడు, లింగ, కొచ్చాడయాన్, కబాలి, కాలా' వంటి చిత్రాలు ప్రేక్షకులను మరీ ముఖ్యంగా తెలుగు వారిని సరిగా మెప్పించలేకపోయాయి. కొందరైతే రజనీ పని అయిపోయిందని విమర్శలు చేశారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలకు సరైన బిజినెస్ కూడా కాలేదన్నది వాస్తవం. అయితే ఆ లోటును తీరుస్తూ '2.ఓ'తో రజనీ రెచ్చిపోతున్నాడు.
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆలస్యం అవుతూ రావడం సినిమాపై, బిజినెస్‌పై వ్యతిరేక ప్రభావం చూపుతుందని కూడా కొందరు అంచనా వేశారు. అయితే శంకర్-రజనీలపై నమ్మకంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అంత విచ్చలవిడిగా డబ్బును ఊరికే ఖర్చు చేయదు కదా....! సినిమా ఆలస్యం అవుతూ ఉండటంతో ఆ ప్రభావం బిజినెస్‌పై కూడా పడింది. కానీ శంకర్ ఒకే ఒక్క టీజర్‌తో తానేమిటో, సినిమా కోసం ఎందుకు ఇంత సమయం పట్టింది చూపించేశాడు. ఈ టీజర్‌ని చూస్తూ ఉంటే నిజం ఇది హాలీవుడ్ చిత్రమేనా? అనే అనుమానం రాకమానదు. ఈ టీజర్ చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ మేనియా ఎలా ఉంటుందో ఈ చిత్రం టీజర్ మరోసారి నిరూపించింది. ఇది నెట్టింట సందడి చేస్తూ సునామీ సృష్టిస్తోంది.
ఈ టీజర్‌లో చూపించిన వీఎఫ్‌ఎక్స్ పనులు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నాయి. తెలుగు టీజర్ వ్యూస్ 50లక్షలు దాటాయి. హిందీ, తమిళ భాషల్లో ఈ టీజర్ మరింతగా దూసుకెళ్లుతోంది. ఈ సినిమాని గ్రాఫిక్స్ కోసమే 545 కోట్లు ఖర్చు చేయగా, సినిమా బడ్జెట్ 1000కోట్లని ప్రచారం సాగుతోంది. నిన్నటివరకు కొందామా? వద్దా? అని ఆలోచించిన వారు ఇప్పుడు ఈ టీజర్‌తో శంకర్, లైకా ప్రొడక్షన్స్ సంస్థల ముందు క్యూకట్టడం ఖాయమనే చెప్పాలి. మరి ఈ చిత్రం 'బాహుబలి' రికార్డులను సులువుగా దాటుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 24గంటల్లో 3కోట్ల వ్యూస్ రావడం సామాన్యమైన విషయం ఏమీ కాదు కదా మరి...!