12ఏళ్లుగా చెన్నై బ్యూటీ త్రిష తన కెరీర్ కొనసాగిస్తోంది. దాదాపు దక్షిణాదిలోని అందరు టాప్, యంగ్‌స్టార్స్‌తో ఆమె కలిసి నటించింది. చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరిని ఓ రౌండ్ వేసింది. ఇక ఈమె తన కెరీర్ ఫేడవుట్ అవుతున్న దశలో చెన్నైలో పారిశ్రామికవేత్త, నిర్మాత, ఫైనాన్షియర్‌తో నిశ్చితార్ధం చేసుకుంది. కానీ ఇది రద్దు కావడంతో త్రిష అదృష్టం మరలా సుడి తిరిగింది. ప్రభుదేవాతో నయన పెళ్లి ఆగిపోయిన తర్వాత నయన కెరీర్ దూసుకుపోతున్నట్లు త్రిష కెరీర్ కూడా సాగుతోంది. ఇక ఈమె కేవలం రజనీకాంత్‌తో మాత్రం నటించలేదని పలుసార్లు విచారం వ్యక్తం చేసింది. ఆ కోరిక కూడా ఈమెకి నెరవేరుతోంది. రజనీ సరసన 'పేట' చిత్రంలో హీరోయిన్ పాత్రను చేస్తూ ఉంది. ధనుష్ నటంచిన 'కోడి' చిత్రం తర్వాత ఈమెకి హిట్స్ లేవు.
ప్రస్తుతం ఆమె విజయ్‌సేతుపతితో చేస్తున్న '96' చిత్రంపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. తాజాగా ఆమె తన జుట్టుని కత్తరించుకుని న్యూహెయిర్ స్టైల్‌తో ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో అందరు ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. మొదట రజనీ చిత్రం కోసమే ఈ న్యూస్టైల్ అని భావించారు. కానీ త్రిష మాత్రం అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఒక అమ్మాయి తన జుట్టుని కత్తిరించుకుంది అంటే ఆమె జీవితంలో పెద్ద మార్పు రాబోతోందనే దానికి అది సూచన అని తెలిపింది. దీంతో చిరకాల వాంఛ అయిన రజనీతో జోడీ కట్టడం సాకారం అయింది. ఇక మిగిలింది పెళ్లే? ఈ అమ్మడు పెళ్లికి రెడీ అవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో వచ్చాయి.
మరి జీవితంలో మార్పు అంటే ఇదేనని కొందరు తీర్మానించారు. దీనిపై త్రిష రియాక్ట్ కాలేదు గానీ పెళ్లి వార్తలు ఉట్టి వదంతులు, వాటిని నమ్మవద్దు. ఆమె జస్ట్ ఫ్యాషన్ కోసమే ఇలా జుట్టుని కత్తిరించుకున్నారని ఆమె తల్లి వివరణ ఇచ్చింది. అయినా ఈమధ్యకాలంలో కాదు.. కాదంటూనే ఎందరో పెళ్లికూతుర్లుగా మారుతున్న విషయం చూస్తే త్రిష కూడా అలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనుందా? అనే అనుమానం వస్తోంది.