నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, నరేష్, మురళీశర్మ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తూ హారిక అండ్ హాసిని అధినేత కె.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తూ, మారుతి దర్శకత్వంలో రూపొందిన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా మారుతున్నాయి. కథే హీరో. కథే ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది హీరో లేదా డైరెక్టర్‌దో మాత్రమే కాదు. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి కూడా చెందుతుందని నాగచైతన్య అన్నారు. ఈ మాట మాత్రం అక్షరసత్యమనే చెప్పాలి.
ఇక ఆయన 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో ఈగోలు లేని క్యారెక్టర్ చేశాను. కానీ నాచుట్టూ ఉన్న పాత్రలు ఎంతో ఇగోగా ఫీల్ అవుతూ ఉంటాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఇగోల వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్స్ బ్రేక్ అయ్యే పరిస్థితులు సినిమాలో చూపించాం. క్లైమాక్స్‌లో ఎంతో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ప్రకృతి ప్రేమికునిగా నటిస్తున్న వెన్నెల కిషోర్‌కి మధ్య వచ్చే సీన్స్ ఎంతో నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఇగో కరెక్టే అనిపిస్తుంది. కానీ అది పక్కవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఈ సినిమాతో నేను ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాను. మారుతి గారు 'బాబు బంగారం' చేస్తున్న సమయంలో నేను అదే బేనర్‌లో 'ప్రేమమ్' చిత్రం చేస్తున్నాను. నాటి నుంచి మారుతితో పరిచయం ఉంది. అలా ఈ సినిమాకి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణ గారి జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో కలిసి రమ్యకృష్ణ గారు పలు చిత్రాలలో నటించింది. ఈ సినిమా మొదట్లో రమ్యకృష్ణ గారితో కలిసి నటించడం బాగా నెర్వస్‌గా అనిపించింది.
ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో 'శైలజారెడ్డి అల్లుడు' డేట్ మార్చడం జరిగింది. సమంత 'యూటర్న్', నా చిత్రం ఒకేరోజు వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇలా అదే రోజున వస్తున్నాం అని సమంతతో చెప్పినప్పుడు ఆమె ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. నిజానికి 'యూటర్న్'వారే ముందుగా ఈ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఇద్దరి చిత్రాలలో ఏది హిట్ కావాలి అని కోరుకుంటారు? అంటే రెండు హిట్ కావాలనే కోరుకుంటాను అని చెబుతాను అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.