ఎన్నో అంచనాలతో వచ్చిన అక్కినేని అఖిల్ చేసిన మొదటి చిత్రం 'అఖిల్' భారీ డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్ నిర్మాతగా వి.వి.వినాయక్ వంటి మాస్ దర్శకునితో అక్కినేని ఫ్యామిలీకి పెద్దగా అచ్చిరాని మాస్ ఇమేజ్ కోసం అఖిల్ చేసిన ప్రయత్నం దెబ్బతీసింది. దాంతో అఖిల్ మొదటి చిత్రం విషయంలో నిర్ణయాన్ని అఖిల్‌కే ఇచ్చిన నాగ్ రంగంలోకి దిగాడు. ఎంతో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా పేరున్న విక్రమ్ కె.కుమార్ చేత పలు స్టోరీలు తయారు చేయించి చివరకు 'హలో' చిత్రాన్ని తీశాడు. కానీ ఇది 'మనసంతా నువ్వే'కి లేటెస్ట్ వెర్షన్‌గా చెడ్డపేరు తెచ్చుకుంది. సినిమాకి బాగానే పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో ఇది ఫ్లాప్‌గానే ముద్ర వేయించుకుంది.
దాంతో అఖిల్ తన మూడో చిత్రాన్ని పలువురిని కాదని మెగాహీరో వరుణ్‌తేజ్‌కి 'తొలిప్రేమ' వంటి హిట్‌ని తన మొదటి చిత్రంతోనే ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో 'సవ్యసాచి'లో నాగచైతన్య సరసన నటిస్తున్న నిధి అగర్వాల్ ఇందులో తమ్ముడు అఖిల్ సరసన జోడీ కడుతోంది. నాగార్జునకి బాగా అచ్చివచ్చిన డిసెంబర్‌లో క్రిస్‌మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంతో అఖిల్ మొదటి హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖిల్‌ని కొత్తగా చూపించడమే కాదు.. కథా కథనాలలో కూడా వైవిధ్యం ఉండేలా వెంకీ అట్లూరి చూసుకుంటున్నాడు.
ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ కీలకమైన పాత్రను చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆడియన్స్‌ని థ్రిల్ చేయడం కోసం ఈ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ చేసే పాత్ర ఎలా ఉండనుంది? దర్శకుడు వెంకీ అట్లూరి ఈ పాత్రను ఎలా డిజైన్ చేస్తున్నాడనే ఆసక్తి అన్ని వైపులా వ్యక్తం అవుతోంది. కాగా ఈ చిత్రానికి నాగార్జున నటించిన 'మజ్ను' టైటిల్ తరహాలో 'మిస్టర్ మజ్ను' అనే పేరును డిసైడ్ చేయనున్నారని సమాచారం.