తెలుగు తెరకు బాలనటిగా, అందునా అక్కినేని నాగేశ్వరరావు, బాపుల కాంబినేషన్‌లో వచ్చిన 'అందాలరాముడు' చిత్రం ద్వారా నటి వరలక్ష్మి పరిచయం అయింది. ఈమె తాజాగా మాట్లాడుతూ, మా నాన్నగారికి సినిమాలంటే చాలా ఇష్టం. కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. నాటి రోజుల్లో ఒకనాడు మా నాన్న తన షూటింగ్‌కి నన్ను తీసుకుని వెళ్లాడు. అక్కడ నన్ను చూసిన రమాప్రభ పాప ముద్దుగా ఉంది. పైగా చైల్డ్ ఆర్టిస్టుల కొరత ఉంది. పక్క సెట్లో షూటింగ్ జరుగుతున్న చిత్రానికి ఓ బేబీ ఆర్టిస్టు కావాలట అని చెప్పింది. వెంటనే నాన్న నన్ను ఆ సెట్‌కి తీసుకుని వెళితే, ఆ రోజు వచ్చిన అందరు బాలనటుల్లో నన్ను ఎంపిక చేశారు. అదే 'అందాలరాముడు'. ఇందులో ఏయన్నార్ నన్ను ఎత్తుకుని 'ఎదగడానికెందుకురా తొందర. ఎదర బతుకంతా చిందర వందర' అనే పాట పాడుతారు.
ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా నటించాను. కేవలం కూతురు, చెల్లెలి పాత్రల్లోనే వందల చిత్రాలలో యాక్ట్ చేశాను. ఇక నాకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పాలి. 'ఓ ఫైట్ మాస్టర్ నేను ఏమీ చేయకపోయినా కూడా నన్ను టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఆయన ఫైట్‌మాస్టర్‌గా పనిచేసిన 'అశ్వద్దామ' చిత్రంలో నేను కృష్ణగారి చెల్లెలు పాత్రలో నటించాను. ఒక సీన్‌లో నేను తడిబట్టలతో 25మెట్లు ఎక్కాలి. అలాగే ఎక్కాను. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి వెనుక నుంచి నీ రెండు కాళ్లను పట్టుకుని నిన్ను రెండు మెట్లు కిందకి లాగుతాడు అని అతడిని తన్సేసి నువ్వు పారిపోవాలి అని ఫైట్‌మాస్టర్ నాకు చెప్పాడు.
కానీ ఫుల్‌షాట్ పెట్టి 24 మెట్లు మీదుగా ఓ బొమ్మలా నన్ను లాగేశాడు. ఆ మెట్ల మీద ఉన్న సిమెంట్ దిమ్మ నడుముకి తాకేసింది. నేను ఏడ్చిన ఏడుపుకి అందరు వచ్చేశారు. కావాలని చేసిన కారణంగా ఫైట్‌మాస్టర్ నాకు సారీ చెప్పాడు. అప్పట్లో నా వెనక ఎవ్వరూ బ్యాగ్రౌండ్ లేని కారణంగానే ఆయన అలా చేశాడు.. అని కన్నీళ్ల పర్యంతం అయింది. ప్రస్తుతం ఈమె బుల్ల్లితెర మీద బిజీగా ఉంది..!