గతంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు మంచి ఫామ్‌లో ఉండగా, ఆయనకంటూ ఏదైనా సినిమా గ్యాప్ వస్తే కె.మురళీమోహనరావు, బోయిన సుబ్బారావు వంటి ఆస్థాన దర్శకులు ఉండేవారు. ఆ గ్యాప్‌లో ఆయన వారితో చిత్రాలు తీసేవారు. అయితే వీరు తీసిన పలు చిత్రాలలో కొన్ని మాత్రమే విజయవంతం అయ్యాయి. ఇక నిన్నటితరం దర్శకుడైన మురళీమోహన్‌రావుకి పట్టిన పట్టు వదలడనే చెడ్డపేరు ఉంది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలతో అవి నిజమేనని తేలుతోంది. రామానాయుడు అర్జున్, శారద ప్రధాన పాత్రలో బి.గోపాల్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ 'ప్రతిధ్వని' చిత్రం తీశారు. ఇందులో డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా శారద అదరగొట్టింది. ఈ చిత్రం బాగా విజయవంతం అయింది. ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ చేసిన బలగం పూడి సీతయ్య పాత్రకు పరుచూరికి ఎంతో పేరు వచ్చింది. పత్రిక మనదే కదా... అలా చేస్తే ఇలా రాయి.. ఇలా చేస్తే అలా రాయి అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించాయి. దాదాపు అదే తరహా పాత్రలో ఆయన ఏయన్నార్, వెంకటేష్‌లు నటించిన 'బ్రహ్మరుద్రులు'లో కూడా నటించాడు. ఆ పాత్రను కూడా నిర్మాత అశ్వనీదత్ బలవంతం మీద చేశానని పరుచూరి చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, అప్పుడు నేను 'జైలుపక్షి' అనే చిత్రానికి సంభాషణలు రాస్తూ బిజీగా ఉన్నాను. 'బ్రహ్మరుద్రులు' చిత్రంలో నటిస్తూనే 'జైలుపక్షి'కి మాటలు రాయడం కష్టంగా అనిపించింది. విగ్గు పెట్టుకుని డైలాగ్స్ రాయడం ఇబ్బందిగా ఉంది. దయచేసి నన్ను ముందుగా పంపు అని ఆ చిత్ర దర్శకుడు కె.మురళీమోహన్ గారిని కోరాను. అంటే ఏయన్నార్ కంటే నిన్ను ముందు పంపాలా? అని మురళీమోహన్‌రావు గట్టిగా మాట్లాడారు. అలా కాదు.. నా షాట్ పూర్తయిన తర్వాత నన్ను పంపించేయ్ అని కోరాను. అలాగే అన్న ఆయన సాయంత్రం వరకు నన్ను పిలవలేదు.. పట్టించుకోలేదు. పేకప్ చెప్పడానికి ముందు ఆ షాట్ తీశాడు. అప్పుడు మాత్రం నేను 'మురళీ..నీకు మరలా సినిమాలు రాస్తానో లేదో తెలియదు గానీ, నీ సినిమా కోసం మాత్రం వేషం వేయను' అని చెప్పేశాను. నిజంగా నాకు చాలా బాధేసిందని మురళీకే చెప్పాను.
ఇక బాలకృష్ణ, విజయశాంతి జంటగా వచ్చిన 'కథానాయకుడు' చిత్రంలో ఓ పాత్ర ఉంది. అందులో నేను ఓ పాత్ర చేశాను. వాస్తవానికి ఆ పాత్రను రావుగోపాలరావుతో గా,నీ సత్యనారాయణ గారితోనైనా చేయించాలని మురళీమోహన్‌రావు ఆలోచన. కానీ ఆ పాత్రకు నేనైతేనే బాగుంటానని రామానాయుడుగారి ఆలోచన. నేను ఆ పాత్ర చేయడం మురళీకి ఇష్టం లేదని తెలిసి నా పార్ట్‌నంతా మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు గారి చేత రామానాయడు గారు తీయించారు. మర్నాడు సినిమా విడుదల అవుతుందనగా అర్ధరాత్రి మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే మురళీ నాకు సారీ చెప్పాడు. మీరు చేసిన పాత్రను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టలేదు. చాలా కొత్తగా కనిపించారు. నాయుడు గారు చెప్పిందే నిజం. పాత ఆర్టిస్టులు చేసి ఉంటే బోర్ కొట్టేదేమో అని అన్నారు. దర్శకుడికి ఇష్టం లేకపోయినా ఆ పాత్ర చేసినందుకు నా బాధంతా ఆ మాటలతో మాయం అయింది. ఆ చిత్రం 25వారాల షీల్డ్ అందుకునేటప్పుడు ఎంతో సంతోషం వేసింది.. అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.