సాధారణంగా తమ శిష్యుల తొలి చిత్రాల నటీనటుల ఎంపిక, మొదటి చిత్రాన్ని ఎలాంటి కథాంశంతో రూపొందించాలి? కెరీర్‌ని ఎలా నిలుపుకోవాలి? సినిమాని బాగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల మద్యకు ఎలా తీసుకుని పోవాలి? వంటి విషయాలలో వారి గురువులు తమ ప్రతిష్టగా భావించి అమూల్యమైన సలహాలను ఇస్తూ ఉంటారు. కొందరైతే కొన్ని సీన్స్‌నో, పాటలనో చిత్రీకరించి కూడా పెడుతుంటారు. మరికొందరు ఆ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కోసం అందులో నటులుగా తళుక్కున మెరుస్తుంటారు. ఇలాంటి సాయమే ఇప్పుడు అనుకోకుండా తెలుగు సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండకి వరంగా మారుతోంది.
ఈ ప్లాన్ తెలుగులో ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం గానీ తమిళంలో కూడా రూపొందుతున్న ఈ చిత్రానికి అక్కడ మాత్రం ఇది పెద్ద బోనస్ కానుంది. ఇక విషయానికి వస్తే తమిళంలో సుప్రసిద్ద నిర్మాతల్లో ఒకరైన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా.. విజయ్‌దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్ వంటి వారితో ‘నోటా’ అనే చిత్రం నిర్మిస్తున్నాడు. రాజకీయాలంటే పడని ఓ యువకుడు రాజకీయాలలోకి వచ్చి ఏం చేశాడు? అనే ఆసక్తకర పాయింట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ న్యూస్ వైరల్‌గా మారుతోంది.
ఆనంద్‌శంకర్ అనే తమిళ యువకుడు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈయన మురుగదాస్ వద్ద శిష్యరికం చేసి ఆయన చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాడు. ఆ అనుబంధంతోనే ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాత్రను మురగదాస్ పోషిస్తున్నాడు. తన గురువునే డైరెక్ట్ చేస్తున్నందుకు ఆనంద్‌శంకర్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇటీవలే ‘గీతాగోవిందం’తో కనీ వినీ ఎరుగని హిట్ కొట్టిన విజయ్‌దేవరకొండ ప్రస్తుతం మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. అవి ట్యాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్. మరో మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.