తెలుగులో ఉన్న క్రియేటివ్ దర్శకుల్లో అల్లరి రవిబాబు ఒకరు. తన మొదటి చిత్రంతోనే నరేష్‌ని పరిచయం చేయడమే కాకుండా తన పేరు ముందు, నరేష్ పేరు ముందు ‘అల్లరి’ అనేది ఇంటిపేరులా మార్చివేశాడు. ఈయన సీనియర్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు తనయుడు. దర్శకత్వ శాఖలో విదేశాలలో సైతం తర్ఫీదు పొందిన ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా ఈయన ఎన్నో చిత్రాలలో, పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలలో నటించాడు. ఇక దర్శకునిగా మారి ‘అల్లరి, అమ్మాయిలు -అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, అవును2, లడ్డుబాబు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో అత్యధిక చిత్రాలు విభిన్నంగా ఎంతో మంచి పేరు సంపాదించాయి.
ఈయనంటే సురేష్‌ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబుకి, రామోజీరావుకి ప్రత్యేక అభిమానం. ఇక రచయితగా కూడా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన కొన్ని చిత్రాలను తానే నిర్మించాడు. నటునిగా 75పైగా చిత్రాలలో నటించాడు. కానీ గత కొంతకాలంగా ఆయనకి సరైనహిట్ పడలేదు. మరోవైపు పందిపిల్లను ప్రధాన పాత్రలో తీసుకుని ఆయన తీసిన ‘అదుగో’ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఆమద్య ఎటిఎం ముందు, పలు చోట్ల క్యూలో నిలబడిన రవిబాబు ‘అదుగో’ చిత్రంలో నటించిన ‘పందిపిల్ల’తో కనిపించి తెలివిగా ప్రమోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన పందిపిల్లకి బ్రష్ చేస్తే.. తనదైన శైలిలో సినిమాపై ఆసక్తిని కలిగించాడు.
ఆ మధ్య విడుదలైన ‘అదుగో’ టీజర్‌కి కూడా మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హార్ట్ టచింగ్ లవ్, థ్రిల్లింగ్ సస్పెన్స్, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్, ఎమోషన్, ధమాకా డ్యాన్స్.. అంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను ట్రైలర్‌లో చూపించారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ బంటి అనే పందిపిల్ల చేసిన సాహసవిన్యాసాలను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. రౌడీల బారి నుంచి తప్పించుకుంటే ఆ పందిపిల్ల శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు ఎంతో తమాషాగా ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు. జంతువుల నేపద్యంలో వచ్చే చిత్రాలు తక్కువ కావడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మరీ ముఖ్యంగా చిన్నపిల్లలను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.