నిజంగా కవలలంటే ఎలా ఉండాలంటే ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లా ఉండాలని ఎవరైనా చెబుతారు. పరుచూరి బ్రదర్స్ లాగా వీరు ఇంత తమ సుదీర్ఘమైన కెరీర్‌లో ఇప్పటికే కలిసే పనిచేస్తున్నారు. పీటర్ హెయిన్స్ వచ్చిన తర్వాత మన చిత్రాల యాక్షన్ సీన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ తెలుగు నేటివిటీ మిస్ అవుతోందనే విమర్శ ఉంది. ఈ విషయంలో రామ్-లక్ష్మణ్‌లు నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తారు. నిజమైన తెలుగు పౌరుషాన్ని చూపించే యాక్షన్ సన్నివేశాలను హీరోల బాడీలాంగ్వేజ్‌కి అనుగుణంగా మలుస్తారు. వీరిద్దరికి చదువు రాదు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరిన మొదట వేటపాలెంకి చెందిన ఫైట్ మాస్టర్ రాజు బాగా ప్రోత్సహించాడు. తాము చదువుకోకపోయిన పది మందికి విద్యాదానం చేస్తున్నారు.
ఇక వీరు హీరోలుగా, దర్శకులుగా కూడా రాణించారు. ఇక విషయానికి వస్తే త్వరలో ఈ జంట ఫైట్ మాస్టర్స్ సినిమాలకు సెలవ్ ప్రకటించనున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ, త్వరలో సినీ పరిశ్రమకు గుడ్‌బై చెబుతున్నామని, సినిమాలు మానేసిన తర్వాత హైదరాబాద్ వదిలేసి, పల్లెటూరి వాతావరణంలో జీవనం సాగించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తాము పుట్టిన కారంచేడులో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నామని, ప్రస్తుతం తాము మహేష్ నటిస్తున్న 'మహర్షి', చిరంజీవి 'సై..రా' చిత్రాలకు పనిచేస్తున్నామని తెలిపారు.
పూరీ జగన్నాథ్ తమకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టారని వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 1987లో చెన్నై వెళ్లి సినిమా ఇండస్ట్రీలోకి రామ్-లక్ష్మణ్ అడుగుపెట్టారు. మొదట్లో ఫైట్ మాస్టర్స్‌కి అసిస్టెంట్స్‌గా వర్క్ చేశారు. ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత వారు కూడా ఇక్కడికే వచ్చి స్ధిరపడ్డారు. 31ఏళ్ల కెరీర్‌లో 11 వందలకు పైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్స్‌గా పనిచేశారు.