వెంకటేష్ - నాగ చైతన్య లు స్వతహాగా మామఅల్లుళ్లు. అయితే వెంకటేష్ అల్లుడు నాగ చైతన్యతో కలిసి దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ లో 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుని ఎప్పుడో మొదలైనప్పటికీ... ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఎందుకంటే నాగ చైతన్య ప్రస్తుతం 'శైలజ రెడ్డి అల్లుడు' సినిమా విడుదలతో బిజీగా ఉండడమే కాదు... 'సవ్యసాచి' సినిమా విషయంలోనూ బాగా బిజీగా వున్నాడు. ఇక వెంకటేష్ మరో మల్టీస్టారర్ అయిన ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరగడం.. వెంకీ - చైతు తమ సినిమాలతో ఫ్రీ అయ్యాక ఈ వెంకీ మామ పట్టాలెక్కుతోంది.
అయితే ఈ సినిమాలో వెంకటేష్ అండ్ నాగ చైతన్యలు ఒరిజినల్ మామ అల్లుళ్ళ మాదిరిగానే సినిమాలోనూ మామ అల్లుళ్లుగా కనిపించబోతున్నారనే విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న విషయమే. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైయ్యాయి. అదేమిటంటే వెంకటేష్ మామాగా... చైతు అల్లుడిగా కనిపిస్తారంటున్న ఈ సినిమాలో వెంకటేష్ తన సొంత ఊరిలోనే.. వ్యవసాయం చేసుకుంటూ ఎప్పుడో చిన్నప్పుడే దూరమైన తన చెల్లి మేనల్లుడి కోసం వెతుకుతున్నప్పటికీ.. వారి ఆచూకీ దొరక్క.. కాలం గడుపుతున్న సమయంలో చెల్లెలు, మేనల్లుడి ఆచూకీ తెలియడం.. వారిని కలుసుకునేందుకు వెంకటేష్ సిటీకి వచ్చినప్పటికీ... మేనల్లుడు ఇతనే అని తెలియక చైతుని కలవడం.. ఇక వారి మధ్యన జరిగే పల్లెటూరి, సిటీ సంభాషణలు ఈ సినిమాలో ఒక రేంజ్ లో ఉండబోతున్నాయంటున్నారు.
అంటే మామ మాస్ గా పల్లెటూరి వ్యక్తిగా కనబడితే.. అల్లుడు క్లాస్ గా పట్నం కుర్రాడిగా కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమాలో మామాఅల్లుళ్లు మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అనే రేంజ్ లో ఉంటాయని... వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ని, నాగ చైతన్యలోని కొంటె కుర్రాడి యాంగిల్ ని దర్శకుడు బాబీ ఈ సినిమాలో చూపించబోతున్నాడనే టాక్ అయితే ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వినబడుతుంది.