నటునిగానే కాదు.. సమర్పకునిగా కూడా తనకు సినిమాలపై ఉన్న టేస్ట్ ఏమిటో తాను నటించే చిత్రాలు, పాత్రల ద్వారానే కాదు.. సమర్పకునిగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ద్వారా దగ్గుబాటి రానా ప్రూవ్ చేసుకున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాజెక్ట్‌ని ఆయన హ్యాండిల్ చేయడమే అయనలోని తపనకు అద్దం పడుతుంది. నాని ‘అ!’ చిత్రంతో చేయలేని పనిని రానా ‘కేరాఫ్ కంచరపాలెం’తో చేసి చూపించాడు. ఇక చిన్న చిత్రాలను నిర్మిస్తోన్న స్టార్ డైరెక్టర్లు అయిన సుకుమార్, సంపత్‌నంది వారికి కూడా ఈ చిత్రం భవిష్యత్తులో ఓ కొలమానంగా నిలుస్తుందని చెప్పాలి.
ఈ చిత్రం గురించి తాజాగా రానా మాట్లాడుతూ.. ‘మహానటి, పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల సరసన ‘కేరాఫ్ కంచరపాలెం’ చేరిందని తెలిపాడు. ఆరు పాటలు, మూడు ఫైట్లు అనే మూస ధోరణి నుంచి తెలుగు సినిమా బయటపడుతోంది. గత ఎనిమిదేళ్లలో ఈ విషయం పలుసార్లు నిరూపితం అయింది. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే నా మొదటి చిత్రం ‘లీడర్’ చేశాను. సినిమా పెద్దదా, చిన్నదా అనేది ముఖ్యం కాదు. కథ వెళ్తూ ఉంటే అందులో లీనం అయ్యేలా చేసేదే నిజమైన సినిమా అంటే. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలో అదే కనిపిస్తుంది. చాలా నిజాయితీతో కూడిన చిత్రం ఇది. ఎంతో సహజంగా కనిపిస్తుంది. సాదారణంగా సెట్స్ వేసి ఊహా లోకంలోకి తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. దర్శకుడు వెంకట్ మహా నటీనటుల కోసం కంచరపాలెం తిరిగి మరీ తనకి సూటయ్యే వారిని ఎంచుకున్నాడు. వాళ్లను వాళ్లలాగే చూపించాడు. నాన్న సురేష్‌బాబు ఫోన్‌లో ఓ చిన్న వీడియో చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సహజంగా తమిళంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తర్వాత తెలుగులో కూడా ఇలాంటి చిత్రాలు బాగా వస్తాయని ఆశిస్తున్నాను. సినీ పరిశ్రమకు వయసుతో పని లేదు. ఇక్కడ కళ, అభిరుచి మాత్రమే మాట్లాడుతాయి..’’ అని చెప్పుకొచ్చాడు.