ఒకవైపు మోదీ తాను క్రమశిక్షణ నేర్చుకోమని చెబుతుంటే తనని నియంత అంటున్నారని వాపోతున్నాడు. అయితే మోదీ హయాంలోనే దేశం విడిచి, దేశీయ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని దేశం ఉడాయించిన వారి లిస్ట్ పెరుగుతోంది. సామాన్యుడు పదివేలు చెల్లించలేకపోతే వారి పరువును బజారుకీడ్చి, వారిని ఆత్మహత్యలు చేసుకునేంతగా ఇబ్బందులు పెట్టే బ్యాంకులు ఇలాంటి వారి విషయంలో మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నాయి. పెద్ద నోట్ల వల్ల ఎవరు లాభపడ్డారో దేశం అంతా గమనిస్తూనే ఉంది. సామాన్యులకు క్రమశిక్షణ నేర్పుతున్నానని చెబుతున్న మోదీ పెద్ద నోట్ల రద్దు పేరుతో ఐదు వందల నోట్లను రద్దు చేసి ఏకంగా రెండు వేల నోట్లను తీసుకుని రావడం ఎప్పటి నుంచో పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు చెప్పినట్లుగా వంద, రెండు వందల నోట్లతో ఆపివేసి ఉంటే నిజమైన ప్రయోజనాలు కాస్త ఆలస్యంగా అయినా నెరవేరి ఉండేవి. ఇక ఈ నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం పట్టుబడిందో మోదీకే తెలియాలి.
గత ఎన్నికల్లో అవినీతిపరుల అంతు చూస్తాను.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని ఇండియాకి రప్పిస్తాను అని మోదీ చేసినవన్నీ ఉత్తరకుమార ప్రగల్బాలుగానే మిగిలాయి. నీరవ్ మోదీలు, విజయ్‌మాల్యాలు, అంబానీల కనుసన్నలలో మోడీ నడుస్తున్నాడు. ఇక విషయానికి వస్తే తన జల్సా జీవితం కోసం బ్యాంకులకు వేల కోట్లను ఎగవేసివిదేశాలలో ఉంటున్న విజయ్‌మాల్యా అక్కడ కూడా తన లగ్జరీ లైఫ్‌ని కొనసాగిస్తున్నాడు. ఆయనను దేశానికి రప్పించడం ఎవ్వరి వల్లా కాకపోయినా ఈయన మాత్రం ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియా, ఇంగ్లాండ్ మద్య ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మూడో రోజున కూడా మాల్యా హాజరయ్యాడు. క్రికెట్ మీద ఇష్టంతో బెంగళూరు ఐపిఎల్ జట్టుని సొంతం చేసుకున్న ఆయన పని వల్ల దేశం పేరు పోవడమే కాదు.. ఇలా టీవీలలో లైవ్‌లో లగ్జరీగా కనిపిస్తూ ఉండటం వల్ల మోదీ పరువు కూడా విదేశాలలో కూడా మట్టికరుస్తోంది. ఇతను మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన ఓ ఘరానా మోసగాడు ఎంతో లగ్జరీగా విదేశాలలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తు దేశాన్నే సవాల్ చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయనే బాధ అందరిలో కలుగుతోంది. అయితే మాల్యాను దేశం రప్పించడం మాత్రం అంత సులువైన విషయం కాదనేది తేలుతూనే ఉంది. లలిత్‌మోదీ నుంచి పలువురి విషయంలో ఇది నిరూపణ అయింది. అయితే మాల్యా తనకు ఇండియన్ టీమ్‌ని కలవాలని ఉందని చేసిన విజ్ఞప్తిని బిసిసిఐ తిరస్కరించడమే కాస్త గుడ్డిలో మెల్ల అని చెప్పవచ్చు.