నమిత అంటే తమిళ తంబీలు దేవతలా భావించి, గుళ్లుగోపురాలు కట్టి పూజించుకునే 'మచ్చాస్' నమిత కాదు. అదే పేరుతో మలయాళంలో మరో నటి ఉంది. ఆమె పేరు నమితా ప్రమోద్. ఈమె తెలుగులో కూడా ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన 'చుట్టాలబ్బాయ్', కోలీవుడ్‌లో 'ఎన్ కాదల్ పుదిదు', 'నిమిర్' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. తాజాగా మలయాళంలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో హీరో దిలీప్‌తో పాటు ఈమె పేరు కూడా తాజాగా వార్తల్లోకి వచ్చింది. దీంతో మీడియా ఫోకస్ ఆమె మీద పడింది.
ఈమె తాజాగా మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఏ ఇబ్బంది వచ్చినా, దానితో నాకు సంబంధం లేకపోయినా అందులో నాపేరు జోడిస్తున్నారు. ఏ విషయమైనా ప్రపంచం ముందుకు తీసుకుని వెళ్లేది మీడియానే. అందులో నిజాలు ఉండేలా చూసుకోవాలి. దేని గురించైనా రాసేటప్పుడు ఆయా వ్యక్తులను సంప్రదించి, నిజనిజాలు తెలుసుకుని రాయాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదేదో రాసేయకూడదు. కొన్ని వివాదాలలో నా పేరు చేర్చి నన్ను వివాదాలలోకి లాగడం నాకు ఆశ్చర్యం కలుగజేస్తోంది. ఈ గాసిప్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న నాకు నా కుటుంబం అండగా నిలుస్తోంది.
ఇకపోతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన కూడా లేదు. వివాహం తర్వాత ఏ అమ్మాయి అయినా తన భర్తపై దృష్టి పెట్టాల్సివుంటుంది. కాబట్టి మరో మూడేళ్ల వరకు నేను వివాహం చేసుకోవాలని భావించడం లేదు. అంటూ నమిత ప్రమోద్ క్లారిటీ ఇచ్చింది. మరి దీనినైనా మీడియా నమ్ముతుందో లేదో వేచిచూడాల్సివుంది..!