ఈనెల 13వ తేదీన కన్నడ బ్లాక్‌బస్టర్ 'యూటర్న్'కి తెలుగు, తమిళ రీమేక్‌గా కన్నడ ఒరిజినల్ దర్శకుడు పవన్‌కుమారే దర్శకత్వం వహించిన 'యూటర్న్' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రను పోషించగా, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్‌రవీంద్రన్ వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ఇందులో నటించిన భూమిక ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, ప్రస్తుతం నా నట ప్రయాణంపై నాకు కొన్ని లెక్కలు, లక్ష్యాలు ఉన్నాయి. నా పాత్రలను, కథలను, దర్శక నిర్మాతలను బట్టి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నాను. నాకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వాడిని కూడా దృష్టిలో ఉంచుకుని ఆసక్తికర చిత్రాలు వచ్చినప్పుడే అందులో భాగస్వామ్యం అవుతున్నాను.
సినిమాల విషయంలో నేను నిత్యం స్కూల్‌కి వెళ్లే ఓ విద్యార్ధిని లాగానే ఆలోచిస్తూ ఉంటాను. ఉదయం సెట్స్‌కి వెళ్లడం, ఏకాగ్రతగా షూటింగ్ చేయడం, సాయంత్రం ఇంటికి రావడం నా దినచర్య. ఇంటికి వచ్చిన తర్వాత మరలా సినిమాల గురించి, ఇంటి పనుల గురించి అస్సలు మాట్లాడుకోం. వచ్చే ఏడాదికి నా సినీ ప్రయాణం మొదలై 20ఏళ్లు అవుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కథలు, పాత్రలు, పరిశ్రమ, మనుషులు ఇలా ఎన్నింటిలోనో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరింత పరిణతితో ఆలోచిస్తున్నాను. ఎన్ని చిత్రాలలో నటిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత మంచి చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నాం? అనేదే ముఖ్యం. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'ఖామోషీ' అనే చిత్రంలో నటిస్తున్నాను. అందులో నాది ఎప్పుడు చేయని విభిన్న పాత్రే. పాత్ర నిడివి ఎంత అనేది ముఖ్యం కాదు. మనం చేసిన పాత్రలు ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపాయి? అనేదే ముఖ్యం. అదే ప్రామాణికంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను.
'యూటర్న్' చిత్రంలో సమంత అద్భుతంగా నటించింది. ఆమె నటనలో ఎంతో గాఢత ఉంటుంది. ఆమె శక్తివంతమైన నటి. ఆమె హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఆమె నటించిన 'ఈగ, రంగస్థలం' వంటి చిత్రాలు చూశాను. ఆమె కళ్లు బలంగా ఉంటాయి. అప్పటికప్పుడు శక్తిని కూడగట్టుకుంటూ ఉంటుంది. అది ఆమె కళ్లలోనే తెలుస్తుంది.. అంటూ సమంతకి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. మరి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' బాగా ఆడని నేపధ్యంలో భూమికకు 'యూటర్న్' చిత్రం ఎలాంటి బ్రేక్‌నిస్తుందో వేచిచూడాల్సివుంది...!