తెలుగులోకి 'యువకుడు' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పవన్‌కళ్యాణ్ సరసన నటించిన 'ఖుషీ' చిత్రంతో ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా మారిపోయిన నటి భూమిక చావ్లా. ఆ తర్వాత ఆమె నాగార్జున 'స్నేహమంటే ఇదేరా', వెంకటేష్ 'వాసు', మహేష్‌బాబు 'ఒక్కడు', ఎన్టీఆర్ 'సింహాద్రి, సాంబ', రవితేజ 'నా ఆటోగ్రాఫ్', చిరంజీవి 'జై చిరంజీవ', ఇలా ఎన్నో చిత్రాలలో నటించింది. అదే సమయంలో హీరోయిన్ ఓరియంటెడ్ ఛాయలున్న 'మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, మల్లెపువ్వు అమరావతి' వంటి చిత్రాలలో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఈమె యోగా గురువు భరత్‌ఠాకూర్‌ని వివాహం చేసుకుని 'తకిట తకిట' చిత్రం నిర్మించి ఆర్దికంగా దెబ్బతింది. ఇక తెలుగులో ఓ సినీ వారపత్రికను కూడా ప్రారంభించి ఆర్ధికంగా నష్టపోయింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఆమె రవిబాబు దర్శకత్వంలో అల్లరినరేష్ హీరోగా నటించిన 'లడ్డూబాబు'లో దర్శనమిచ్చింది. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్‌కి టర్న్ తీసుకుని నాని నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'లో నాని వదినగా మెప్పించింది. హిందీలో ఇటీవల వచ్చిన 'ధోని'తో పాటు పలు తమిళ చిత్రాలలో యాక్ట్ చేసింది.
ప్రస్తుతం ఆమె నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి'తో పాటు 13వ తేదీన విడుదల కానున్న సమంత 'యూటర్న్' చిత్రంలో కీలకపాత్రను పోషించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హర్రర్ చిత్రాల కంటే నాకు థ్రిల్లర్ చిత్రాలంటే ఇష్టం. కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'యూటర్న్' చిత్రాన్ని కొద్ది పాటి మార్పులతో కన్నడ దర్శకుడు పవన్‌కుమారే తెలుగులోకి తెరకెక్కించాడు. నేను దర్శకునికి కావాల్సిన విధంగా మౌల్డ్ అయి నటించాను. తొలినాళ్లలో నేను కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో కూడా నటించాను. ఇది వరకు చేసిన పాత్రలకంటే విభిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఒక నటికి విభన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తే లభించే తృప్తే వేరు. అందుకే ఈ కథ వినగానే ఒప్పుకున్నాను. కన్నడలో 'యూటర్న్' చిత్రం చూశాను. దానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో బాగా ఉంటుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. బాలీవుడ్‌లో వస్తున్న 'తుమ్హారీ సుల్' తరహా చిత్రాలు తెలుగులో కూడా రావాల్సివుంది. అలాంటి కథలను తయారు చేయడంపై దర్శక రచయితలు దృష్టి పెట్టాలి.
విద్యాబాలన్ 42ఏళ్ల వయసులో కూడా అంత అద్భుత చిత్రంలో నటించిందటే దానికి రచయితలు, దర్శకులే కారణం. మలైకా అరోరా, ఐశ్వర్యారాయ్, భూమిక వంటి వారు కూడా అద్భుత చిత్రాలు చేస్తున్నారంటే దర్శక రచయితలే కారణం. ఇది మంచి పరిణామం. ఇది తెలుగులో కూడా వస్తుందని ఆశిస్తున్నాను. తెలుగు సినిమా ప్రేక్షకులు వాణిజ్యపరమైన చిత్రాలను ఇష్టపడతారు. దాంతో నిర్మాతలు కూడా ఆ తరహా కథలపైనే దృష్టి పెడుతున్నారు. పెట్టిన డబ్బు తిరిగి రావాలని ఆశించడం మామూలే. అయితే పెద్ద నిర్మాతలు భారీ బడ్జెట్ వాణిజ్య చిత్రాలతో పాటు ఇలాంటి తరహా చిత్రాలపై కూడా దృష్టి పెడితే బాగుంటుంది.. అని చెప్పుకొచ్చింది.