కొందరు ఆంధ్రా మేధావులైన చలసాని శ్రీనివాస్, శివాజీ వంటి వారు చంద్రబాబుకి అమ్ముడుపోయారని విమర్శించవచ్చు. కానీ విశాల దృక్పథంతో ఆలోచిస్తే మాత్రం మన రాజకీయ పార్టీలు, నాయకులలో ఐక్యత లేని కారణంగానే జాతీయ పార్టీలు ఏపీపై తమ పెత్తనం చూపిస్తున్నాయన్న వాదనలో కూడా నిజం ఉంది. అదే తమిళనాడు వంటి చోట్ల వారి పెత్తనం వీలుకాదు. కాబట్టి విభజించి పాలించు అనే సూత్రంతో వీరు ఏపీని మోసం చేస్తున్నారు. ఈ విషయంలో గతంలో కర్ణాటక ఎన్నికలకు ముందే హీరో శివాజీ కేంద్రంలోని బిజెపి ఆపరేషన్ గరుడతో పాటు పలు విధాలుగా అమలు చేస్తోన్న కుట్ర రాజకీయాలు పూర్తి స్థాయిలో కాకపోయినా దాదాపు అదే అజెండాతో పనిచేస్తున్నాయన్న విషయం చూచాయగా నిజమనే తేలింది. కాకపోతే విషయం బయటకి రావడంతో కేంద్రంలోని బిజెపి కాస్త ముందు వెనుక ఆలోచిస్తోంది.
తాజాగా శివాజీ మాట్లాడుతూ, సోమవారమే కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగ బద్ద సంస్థ చంద్రబాబుకి నోటీసులు ఇవ్వబోతోందని, ఈ విషయం అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు. ఈ దిశగా బిజెపి అధిష్టానం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అది ప్రజలకు తెలిస్తే వికటిస్తుందనే సందేహంతోనే బిజెపి దూకుడు ప్రదర్శించడం లేదు అనేది వాస్తవం. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి, కేసీఆర్‌ని దగ్గరకు తీసుకోవడం కూడా ఇందులో భాగమేనని తేలుతోంది. ఇక ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఈ నోటీసుల విషయంలో నాలుగైదు రోజులు ఆలస్యం అయితే కావచ్చని, కానీ ఈ కుట్ర మాత్రం నిజమేనని ఆయన విశ్వసనీయ సమాచారంగా చెప్పుకొచ్చాడు. ఓ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం అంటే అది భావితరాలకు తీరని ద్రోహం చేయడమేనని శివాజీ మండిపడ్డాడు. తనకు చంద్రబాబైనా, జగన్ అయినా ఒకటేనని, ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తితో విరుద్దమని శివాజీ తెలిపాడు. తప్పు చేస్తే ఇంతకాలం మౌనంగా ఎందుకు ఉన్నారు? సమయం చూసి దెబ్బతీయాలనుకోవడం చాలా నీచం. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు ఈ స్థాయి కుట్రలు అవసరమా? బ్రిటిష్‌వారు అనుసరించిన విభజించి పాలించు సూత్రాన్ని జాతీయ పార్టీలు ఒంటపట్టించుకున్నాయి.
చంద్రబాబు నచ్చకపోతే ఆయన్ని చంపివేయండి. రేపు జగన్ నచ్చకపోతే జగన్‌ని చంపేయండి. ఆ తర్వాత దేశంలో ఎవరు నచ్చకపోతే వారిని చంపేయండి. రాజకీయాలు న్యాయబద్దంగా, నీతిమంతంగా ఉండాలి? కానీ కేంద్రం అనుసరిస్తోన్న ఈ పద్దతి ఏమిటి? అసలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏమిటి? నాకు ప్రాణహాని ఉంది. ఇప్పటికే రెండుసార్లు అంటూ ఆయన మధ్యలో ఆపివేశారు. మీడియా లేకపోతే నన్ను బతకనిచ్చేవారు కాదు. నిన్నటి వరకు పిడీ అకౌంట్ల పేరుతో బిజెపి గోల గోల చేసింది. ఇప్పుడు చంద్రబాబును లోపల వేయాలని చూస్తోంది. నిన్నటి వరకు టిటిడిని అడ్డుపెట్టుకుని గోల చేశారు. పనిచేసిన వారు. ఈవోలు అందరు సవ్యంగా ఉందని చెప్పినా కూడా స్వామీజీలను, ఇతర పార్టీలను అడ్డుపెట్టి గొడవ చేయాలని చూశారంటూ శివాజీ బిజెపిపై మండిపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.