ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్ కోసం విరామం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ లైఫ్ లో ఒక దురదృష్టకర సంఘటన జరగడంతో.. కొద్ది రోజులు అరవింద సమేత షూటింగ్ కి ఎన్టీఆర్ బ్రేకివ్వాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కన్న తండ్రి హరికృష్ణని ఘోర రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో... ఎన్టీఆర్ ఒక్కసారిగా దిగులు పడ్డాడు. అయితే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కూడా తండ్రి మరణాన్ని దిగమింగుకుని... అన్నదమ్ములిద్దరూ నిర్మాతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. తమ సినిమాల షూటింగ్ కి కొద్దిపాటి విరామంతో జాయిన్ అయ్యారు. అయితే షూటింగ్ సెట్స్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఎనర్జీ లెవల్స్ తో రెచ్చిపోయే ఎన్టీఆర్... ఇప్పుడు తండ్రి మరణంతో కాస్త డల్ అయ్యాడు.
అయితే తాజాగా అరవింద సమేత సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఎన్టీఆర్ గురించి చేసిన ఒక ట్వీట్ ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ థమన్, ఎన్టీఆర్ గురించిన ట్వీట్ ఏమిటంటే.. అరవింద సమేత సాంగ్ షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ని చూసిన థమన్ ఈ విధంగా ట్వీట్ చేసాడు. తారక్ అన్న ఈ రోజు(ఆదివారం)తో చాలా ఎమోషనల్ గా సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఈ రోజు(ఆదివారం) ఆయన తన డ్యాన్స్ తో, మళ్లీ తన ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టు అనిపించింది. నాకు చాలా మంచి ఫీల్ కలిగింది. నిజంగా మీకు చాలా పవర్ ఉంది తారక్ అన్నా.. అరవింద సమేత చిత్రబృందం తరుపున, మీకు లాట్స్ ఆఫ్ లవ్. అదేవిధంగా ఇక ఈ వారం నుండి అరవింద ఆడియో అప్‌డేట్స్ మొదలవుతాయి.. అంటూ ఎన్టీఆర్ పై థమన్ చేసిన ఈ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.
పూజ హెగ్డే, ఇషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో నాగబాబు ఒక కీలకపాత్రలో నటిస్తుండగా... జగపతి బాబు విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 12 న విడుదలకు సిద్దమవుతుంది.