బుల్లితెరపై వచ్చే ప్రజాదరణ పొందిన షోలకు వచ్చి తమ సినిమాలను ప్రమోషన్ చేసుకోవడం బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తూ ఉంది. స్వయాన తమిళంలో బిగ్‌బాస్‌ని హోస్ట్ చేసే కమల్‌హాసనే తన ‘విశ్వరూపం2’ కోసం తెలుగులో బిగ్‌బాస్ సీజన్2కి వచ్చి ప్రమోట్ చేసుకున్నాడు. ఈ తరహా ట్రెండ్ తెలుగులో ఇంకా పాపులర్ కాలేదు. కానీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో నాగార్జున, చిరంజీవి వంటి వారు కూడా బుల్లితెర ప్రవేశం చేయడం, తర్వాత బిగ్‌బాస్ సీజన్1ని ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సందర్భంలో మన వారు కూడా ఒకప్పుడు చిన్నచూపు చూసిన బుల్లితెర ద్వారా తమ చిత్రాల ప్రమోషన్స్‌కి ఉత్సాహం చూపిస్తున్నారు. అంతకు ముందు కూడా జబర్దస్త్, సుమ యాంకరింగ్ చేసే పలు షోల ద్వారా కొన్ని చిత్రాల ప్రచారం సాగింది.
ఇక విషయానికి వస్తే తెలుగులో కూడా టైం పాస్ రియాల్టీ షోగా ప్రజాదరణ పొందుతోన్న నాని హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ సీజన్2కి తాజాగా సిల్లీఫెల్లోస్ చిత్ర హీరోలు అల్లరినరేష్, సునీల్‌లు వచ్చారు. ఈ సందర్భంగా వారు బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చి ఇంటి సభ్యులతో మాట్లాడారు. సినిమా గురించిన పలు విశేషాలను వారు తెలిపారు. అందులో భాగంగా పార్టిసిపెంట్స్‌తో కలిసి గేమ్ ఆడారు. కాగా ఈ వారం బిగ్‌బాస్ నుంచి శ్యామల ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆమె మరలా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా రెండో సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే గతవారం ఇచ్చిన టాస్క్‌లలో ఆమె సరైన ఆటతీరు కనపరచకపోవడంతో ఆమె బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే బిగ్‌బాస్ సీజన్2 విన్నర్‌గా ఇప్పటికే ప్రచారం పొందుతోన్న కౌశల్, దీప్తి, అమిత్‌లు మాత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లి బతికి పోయారు. మరి ఈ సీజన్‌కు ఎవరు బిగ్‌బాస్ సీజన్2 విజేతగా నిలుస్తారో వేచిచూడాల్సివుంది..!