కళలకు, కళాకారులకు భాషా, మత, కుల, ప్రాంతీయ భేదాలు ఉండవు. కాబట్టే తెలుగువాడైన ఎస్పీబాలసుబ్రహ్మణ్యం దేశంలోనే అనేక భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడాడు. మలయాళీ, క్రిస్టియన్ అయిన ఏసుదాస్ హిందు దేవుళ్ల భక్తిగీతాలు, విషాద గీతాలు పాడుతూ ఉంటే మనసు పులకరిస్తుంది. మహ్మద్‌రఫీ తెలుగులో పాటలు పాడాడు. లతామంగేష్కర్ కూడా మరపురాని గీతాలు పాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇక విషయానికి వస్తే తనదైన గుండుతో కనిపించే విభిన్నఆహార్యం, పాటలను హుషారుగా పాడుతూ వినేవారి చేత స్టెప్పులు వేయించేంతగా రంజింపజేయడంలో బాబా సెహగల్‌ది ప్రత్యేకశైలి. అప్పుడెప్పుడో చిరంజీవి, నగ్మా జంటగా కోడిరామకృష్ణ దర్శకత్వంలోవచ్చిన ‘రిక్షావోడు’ చిత్రంలో ‘రూప్ తేరా మస్తానా’ అనే పాటతో యూత్‌ని ఉర్రూతలూగించిన బాబా సెహగల్ పాడేది తక్కువ పాటలే అయిన తెలుగులో ఇంతకాలంగా తనదైన ఉనికిని సాధించడం చిన్న విషయం కాదు.
ముఖ్యంగా ఆయనకు చిరంజీవి, మరీ ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ చిత్రాలలో పాడిన పాటలు పవర్‌సింగర్‌గా, మెగా సింగర్‌గా ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చాయి. మరీ ముఖ్యంగా ‘జల్సా’ చిత్రంతో ఈయన పాడిన టైటిల్ సాంగ్ విని ఊగిపోని అభిమాని ఉండడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘జల్సా’ చిత్రంలోని టైటిల్ సాంగ్ నాకెంతో క్రేజ్‌ని తీసుకుని వచ్చింది. నాకు టాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. నాకు తెలుగు అంతగారాదు. ఎక్కడైనా మాట్లాడాలన్నా, ఈవెంట్స్‌లో పాల్గొనాలన్నా ఓ కాగితంపై రాసుకుని వెళ్తాను. టాలీవుడ్‌లో హీరోల పేర్లు నాకెంతో ఇష్టం. పవన్‌కళ్యాణ్ పాటలు ఎక్కువగా పాడటం వల్లే నాకు పవర్‌సింగర్ అనే గుర్తింపు వచ్చింది.
చిరంజీవి, పవన్‌కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, రవితేజ వంటి వారికి పాటలు పాడాను. మహేష్‌కి మాత్రం ఇంత వరకు పాడలేదు. మహేష్ గారూ...నాకు మీ సినిమాలో ఓ అవకాశం ఇప్పించండి... అని ఆయన నవ్వుతూ కోరాడు. ఇక ప్రభాస్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని, సింపుల్‌గా ఉంటూ అందరితో కలిసిపోతారని చెప్పిన ఆయన ప్రభాస్ ఎప్పుడు తన వద్దకు వచ్చినా.. హలో బాబా? ఎలా ఉన్నారు? అంటూ ప్రేమతో మాట్లాడుతారని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.